Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి
Maoists Surrender( image credit: swetcha reporter)
Telangana News

Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన

Maoists Surrender: మావోయిస్టుల లొంగు‘బాట’ కొనసాగుతున్నది. 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయారు. భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించారు. జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే మావోయిస్టులు లొంగిపోతున్నట్టు డీజీపీ చెప్పారు. హైదరాబాద్‌లోని పోలీస్​ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు మొత్తం 24 ఆయుధాలను అప్పగించారన్నారు. వీటిలో మూడు ఏకే 47 తుపాకులతోపాటు ఓ లైట్ మిషన్​ గన్​, ఐదు ఎస్​ఎల్​ఆర్​ రైఫిళ్లు, ఏడు ఇన్సాస్​ రైఫిళ్లు, ఒక బీజీఎల్ గన్, నాలుగు 303 రైఫిళ్లు, ఒక సింగిల్ షాట్ రైఫిల్​, రెండు ఎయిర్​ గన్లు ఉన్నట్టు తెలిపారు. మొత్తం 733 తూటాలు, 8 బీజీ షెల్స్​‌ను కూడా అప్పగించినట్టు చెప్పారు.

మావోయిస్టుల్లో విభేదాలు

24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణకు చెందిన ఎర్రోళ్ల రవి అలియాస్​ సంతోష్ తోపాటు 11 మంది గెరిల్లా ఆర్మీ బెటాలియన్ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నట్టు డీజీపీ చెప్పారు. అర్బన్​ నక్సలైట్‌గా పని చేస్తూ మావోయిస్టులకు షెల్టర్ ఇస్తున్న మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామ వాస్తవ్యుడు, పీడీఎస్ సభ్యుడు కవికారపు ప్రభంజన్ కూడా సరెండర్​ అయినట్టు తెలిపారు. ఆపరేషన్ కగార్​ నేపథ్యంలో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమాత్రం పరిచయం లేని ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం క్యాడర్​‌పై ఒత్తిడి తెస్తున్నదని శివధర్ రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసం

కొత్త ప్రాంతాల భౌగోళిక పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం, స్థానిక ప్రజల మద్దతు కూడా అందకపోవడంతో ఆయా చోట్ల ఉండడంలో మావోయిస్టులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రోజువారీ నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారన్నారు. దీనికి తోడు మావోయిస్ట్ పార్టీలో పెరిగిపోయిన అంతర్గత విభేదాలు, వర్గ పోరు, నాయకత్వ స్థాయిలో తలెత్తుతున్న అభిప్రాయ భేదాలు, క్షీణిస్తున్న ఆరోగ్యం మావోయిస్టుల లొంగుబాటుకు దారి తీస్తున్నాయన్నారు. దాంతోపాటు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసం కూడా వాళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ ప్రధాన కారణమన్నారు.

Also Read: Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఏకంగా 37 మంది లొంగుబాటు.. డీజీపీ కీలక ప్రకటన

తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేలు

లొంగిపోయిన డివిజనల్ కమిటీ సభ్యులకు పునరావాసం కోసం రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు డీజీపీ చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లైట్ మిషన్​ గన్‌ను అప్పగించినందుకు రూ.5 లక్షలు, ఏకే 47 రైఫిళ్లను అప్పగించినందుకు 4 లక్షల రూపాయల, ఇన్సాస్​ రైఫిల్​‌కు రూ.2 లక్షలు, 303 రైఫిళ్లకు రూ.లక్ష, యూజీబీఎల్ అటాచ్​ మెంట్‌కు రూ.40 వేలు, ట్వెల్వ్ బోర్ సింగిల్ షాట్ గన్‌కు 30 వేల రూపాయల చొప్పున నగదు ఇవ్వనున్నట్టు తెలిపారు. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులందరికీ కలిపి కోటి 46 లక్షల 30 వేల రూపాయలను ఇస్తామన్నారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేల రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు.

ఈ ఏడాదిలో 509 మంది లొంగుబాటు

ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా డీజీపీ శివధర్​ రెడ్డి చెప్పారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 57 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్టుగా వివరించారు.

Also Read: Maoists Surrendered: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు

Just In

01

Avatar3 Box Office: ‘అవతార్ 3’ తొలిరోజు ప్రపంచ వసూళ్లు చూస్తే మతి పోవాల్సిందే?.. ఇండియాలో ఎంతంటే?

Adwait Kumar Singh: వరదలు, పరిశ్రమ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!

Droupadi Murmu: నియామకాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Vrushabha Trailer: కింగ్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ఇరగదీశాడు.. ‘వృషభ’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?

Pidamarthi Ravi: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం హామీ నెరవేర్చాలి : పిడమర్తి రవి