Dr Suranjan: జమ్మికుంట మున్సిపల్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన రాజకీయ నాటకం తెరపైకి వచ్చింది. పదవీ కాంక్ష ముందు పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలు తలవంచక తప్పదని డాక్టర్ సురంజన్(Dr. Suranjan) వ్యవహారం నిరూపిస్తోంది. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్ సామాజిక వర్గానికి రిజర్వ్ కావడంతో.. ఆ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో సురంజన్ రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్(Congress) నుంచి బిఆర్ఎస్(BRS)లోకి జంప్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ నెల 19న హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్(Vodithala Pranav) సమక్షంలో భారీ ఆశలతో హస్తం తీర్థం పుచ్చుకున్న ఆయన, అక్కడ పప్పులు ఉడకవని భావించారో లేక గులాబీ బాస్ వ్యూహానికి చిక్కారో కానీ, వారం తిరగకముందే కండువా మార్చేశారు.
Alson Read: Janasena MLA Viral Video: జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. సంచలన వీడియో పోస్ట్ చేసిన వైసీపీ
ఆ పార్టీ విఫలమైందని..
మంగళవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) నివాసంలో గులాబీ కండువా కప్పుకున్న సురంజన్, తన రాజకీయ అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీపై ఘాటైన విమర్శలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించడం గమనార్హం. వారం కిందట ఇదే కాంగ్రెస్(Congress) ప్రజల కోసం పనిచేస్తుందని పొగిడిన నోటితోనే, ఇప్పుడు ఆ పార్టీలో సరైన అభ్యర్థులే లేరని ఎద్దేవా చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. కేవలం మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే స్వార్థంతోనే ఆయన ఈ రాజకీయ యూ-టర్న్ తీసుకున్నారనే విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ ‘జంపింగ్’ పరిణామం జమ్మికుంట ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

