Sangareddy Drug Bust: ఆయన ఆలయ పూజారి. చుట్టుపక్కల పది ఊర్ల జనానికి గురువు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఆయనకే పిలుపు వస్తుంది. అయితే, దైవ సన్నిధిలో భక్తిప్రపత్తులతో కాలం గడుపుతూ నలుగురికి మంచి చెప్పాల్సిన ఆ పూజారి బుద్ది అడ్డదారులు తొక్కింది. డబ్బు సంపాదన కోసం గంజాయి సాగు ప్రారంభించిన సదరు పంతులు చివరకు ఎక్సయిజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుని నుంచి అధికారులు 70లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!
బంతి పూల తోటలో గంజాయి మొక్కలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచాగామ్ గ్రామ వాస్తవ్యుడైన నర్సయ్య ఊర్లోని ఆలయంలో పూజారిగా ఉన్నాడు. కాగా, గ్రామంలో గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారం మేరకు డీటీఎఫ్ సీఐ శంకర్, ఎస్ఐలు హన్మంత్, అనుదీప్ తోపాటు అంజిరెడ్డి, అరుణ జ్యోతి, శివకృష్ణ, రాజేశ్ లతో కలిసి దాడి చేశారు. తనిఖీలు చేయగా దేవాలయ ప్రాంగణంలో భగవంతుని కోసం పెంచుతున్న బంతి పూల తోటలో గంజాయి మొక్కలు కనిపించాయి. ఈ క్రమంలో ఎక్సయిజ్ పోలీసులు 685 గంజాయి మొక్కలు, 17,741 కిలోల గంజాయి, 0.897 గంజాయి విత్తనాలు, 30వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు
వీటి విలువ 70లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం నారాయణఖేడ్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు. పకడ్భంధీగా దాడి జరిపి నిందితున్ని అరెస్ట్ చేసి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మెదక్ డిప్యూటీ కమిషనర్ జే.హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎక్సయిజ్ సూపరిండింటెంట్ నవీన్ చంద్ర, ఏఈఎస్ మణెమ్మలు అభినందించారు.
Also Read: Warangal Drug Bust: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత!

