Amberpet Drug Bust: గంజాయితోపాటు డ్రగ్స్ ను రవాణా చేస్తున్న గ్యాంగులోని ఇద్దరిని ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4.495 కిలోల గంజాయి, 0.65గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు. కాగా, అదుపులోకి తీసుకునే సమయంలో నిందితులు కత్తులతో ఎక్సయిజ్ సిబ్బందిపై దాడి జరిపి పారిపోవటానికి యత్నించారు. అయితే, నిందితులను ఛేజ్ చేసిన సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఓ మహిళా నిందితురాలు పరారయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి నుంచి గంజాయి, బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్ తెప్పించుకున్న కొందరు కారులో పెద్ద అంబర్ పేట వైపు వస్తున్నట్టుగా ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీంకు సమాచారం అందింది.
Also Read: Drug Racket: మరో సక్సెస్ సాధించిన ఈగల్.. ఎన్ని కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారంటే?
కత్తులతో ఎక్సయిజ్ సిబ్బందిపై దాడి
ఈ నేపథ్యంలో సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐలు బాలరాజు, సంధ్యతోపాటు సిబ్బందితో కలిసి అంబర్ పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 ప్రాంతంలోని పిస్తా హౌస్ వద్ద మాటు వేశారు. అందిన సమాచారం మేరకు ఓ కారు అటుగా రాగా దానిని ఆపారు. కారులో ఉన్న భార్యాభర్తలు వెంకట చైతన్య, మమతతోపాటు రవీందర్ అనే వ్యక్తిని కిందకు దింపారు. తనిఖీ చేయగా కారులో గంజాయి, ఎండీఎంఏ డ్రగ్ దొరికాయి. ఆ వెంటనే వెంకట చైతన్య, మమత, రవీందర్ లు కత్తులతో ఎక్సయిజ్ సిబ్బందిపై దాడి చేశారు. దీంట్లో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సిబ్బందిని గాయపరిచిన తరువాత ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. అయితే, వారిని వెంటాడిన ఎక్సయిజ్ సిబ్బంది వెంకట చైతన్య, రవీందర్ లను పట్టుకున్నారు. మమత మాత్రం తప్పించుకుని ఉడాయించింది.
చాలా రోజులుగా
భార్యాభర్తలైన వెంకట చైతన్య, మమతలు చాలా రోజులుగా రాజమండ్రి నుంచి గంజాయి తీసుకు వస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్నట్టుగా విచారణలో వెల్లడైంది. దాంతోపాటు బెంగళూరులో ఉంటున్న స్నేహితుల ద్వారా డ్రగ్స్ కూడా తెప్పిస్తూ అమ్ముతున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో పలుమార్లు అరెస్ట్ కూడా అయినట్టు తెలిసింది. అరెస్ట్ చేసిన ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మమత కోసం గాలిస్తున్నారు. కాగా, కత్తులతో దాడి చేసినా ధైర్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షా నవాజ్ ఖాసీం అభినందించారు.
Also Read: Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్
