Drug Factory Busted: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో నడుస్తున్న డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశీ మహిళ సహా 12మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో 12కోట్ల రూపాయల విలువ చేసే మెఫెడ్రోన్ డ్రగ్, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మీరా భయందర్ వసాయి విరార్ కమిషనరేట్ క్రైం డిటెక్షన్ యూనిట్ అధికారులు గత నెలలో బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్ల (23)ను స్థానికంగా ఉన్న మీరా రోడ్డలోని కశిమిరా బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసి 105 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె డ్రగ్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ లో సభ్యురాలని వెళ్లడయ్యింది.
Also Read: AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు
9మందిని అరెస్ట్
ఈ నేపథ్యంలో మరో 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 178గ్రాముల మెఫెడ్రోన్, 23.97 లక్షల నగదును సీజ్ చేశారు. వీరిని జరిపిన విచారణలో చర్లపల్లి నవోదయ కాలనీలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్ తయారీ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సీఐ ప్రమోద్ నేత్రుత్వంలో ప్రత్యేక బృందం ఇక్కడికి వచ్చింది. ఫ్యాక్టరీ నడిపిస్తున్న శ్రీను విజయ్ వోలెటి, తానాజీ పండరినాథ్ పట్వారిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5కిలోల 790 గ్రాముల మెఫెడ్రోన్, 35,500 లీటర్ల కెమికల్స్, 950 కిలోల పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ తయారీ పరికరాలు సీజ్
అరెస్ట్ అయిన అందరి నిందితుల నుంచి 27 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, ఒక టూ వీలర్, డ్రగ్ తయారీ పరికరాలను సీజ్ చేశారు. ఈ ముఠా డ్రగ్ తయారు చేస్తూ పకడ్భందీ నెట్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్ముతున్నట్టు మీరా భయందర్ వసాయి విరార్ కమిషనర్ నికేత్ కౌశిక్ తెలిపారు. విదేశాలకు కూడా డ్రగ్స్ చేరవేస్తున్నట్టు పేర్కొన్నారు. గ్యాంగ్ ను పట్టుకోవటంలో కీలక పాత్ర వహించిన అదనపు కమిషనర్ దత్తాత్రేయ షిండే, డీసీపీ సందీప్ దోయిఫోడే, ఏసీపీ మదన్ బల్లాల్ ను అభినందించారు.
Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..