Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) బీజేపీ (BJP) గూటిలో చేరి చాలాకాలమే అయ్యింది. అయితే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో (BRS) నంబర్-2 నాయకుడి రేంజ్లో వెలుగొందిన ఆయన, కాషాయ పార్టీలో మాత్రం అంత సానుకూలంగా సాగడం లేదన్నది బహిరంగ రహస్యమే. చాలా వేదికలపై ఆయన మాట్లాడిన మాటలు పార్టీలో వర్గ విభేదాలను బయటపెట్టాయి. దీంతో, బీజేపీలో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారతారంటూ పలుమార్లు ప్రచారం జరిగింది. సొంతంగా పార్టీ పెట్టబోతున్నారని, అందుకు సన్నద్ధమవుతున్నారంటూ కూడా ఒకానొక సమయంలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా, ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌పై చర్చ మొదలైంది. ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ మరోసారి ప్రచారం మొదలైంది.
మన బాస్ కేసీఆర్..
ఈటల రాజేందర్ తాజాగా నేరేడ్మెట్లో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో మాట్లాడిన మాటలు రాజకీయ చర్చలకు దారితీశాయి. సభలో ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో ‘బాస్ కేసీఆర్ గుర్తుకొచ్చారు. అదే నా బాస్ కూడా’ అని అన్నారు. కేసీఆర్‌ను ఈటల బాస్ అని సంబోధించడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమలం గూటిలో ఉంటూ బీఆర్ఎస్లో తన గతాన్ని గుర్తు చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? అనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ ఎంపీ అయ్యి ఉండి, బద్ధ శత్రువుగా భావించే కేసీఆర్‌ను బాస్ అనడం వెనుక ఉద్దేశం ఏమిటి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాటలను ఆత్మీయత వరకేనని భావించాలా?, లేక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ? అన్న టాక్ వినిపిస్తోంది.
Read Also- King100: ‘కింగ్100’వ చిత్రంలో టబు.. నాగార్జున ఏమన్నారంటే?
కాగా, తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన కేసీఆర్ వెన్నంటి నడిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలుత ఆర్థిక శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖను నిర్వహించారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ఎస్కు ఆయన గుడ్‌బై చెప్పారు. అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. అయితే, బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ సొంత గూటికి (BRS) వెళ్తారనే ప్రచారం అప్పుడప్పుడు తెరపై చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ చర్చకు తెరలేపాయి.
Read Also- Nursing Recruitment: నర్సింగ్ జాబ్ అభ్యర్ధులకు జలక్.. చిక్కులు తెచ్చిన క్రెడిట్ పాయింట్ విధానం!
రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదని, ఈటల రాజేందర్ వంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లోతైన అర్థం ఉండవచ్చనే విశ్లేషణలు మొదలయ్యాయి. లేక, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, మల్కాజిగిరి పరిధిలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను తన వైపు తిప్పుకోవడానికి ఈటల స్కెచ్ వేశారా?అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో తన అసంతృప్తికి సంకేతమా? అనే విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. అయితే, గతంలో ఓ సందర్భంలో పార్టీ మార్పు ఊహాగానాలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ, ఫేక్ ప్రచారాలను కొట్టిపారేశారు. పార్టీలు మార్చడం అంటే బట్టలు మార్చినంత సులభం కాదని వ్యాఖ్యానించారు. కానీ, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని జగమెరిగిన సత్యం. మా బాస్ కేసీఆర్ అన్న మాట కేవలం పాత జ్ఞాపకమా?, లేక, అంతరార్థం ఏదైనా ఉందా? అనేది వేచిచూడాలి మరి!.
బాస్ is బ్యాక్…? pic.twitter.com/aKaYOrdXPV
— Radha Parvathareddy (@radhachinnulu) January 29, 2026

