Nursing Recruitment: రాష్ట్రంలో నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ, అభ్యర్థులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. కొందరు క్యాండిడేట్లు రెన్యువల్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. టీజీ నర్సింగ్ కౌన్సిల్ అమలు చేస్తున్న కొత్త ‘క్రెడిట్ పాయింట్’ విధానం వేలాది మంది అభ్యర్థుల మెడకు చుట్టుకుంది. రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాకపోతే, 1:15 నిష్పత్తిలో ఎంపికైన తాము అనర్హులుగా మారే ప్రమాదం పొంచి ఆయా అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. రెన్యువల్ కోసం రిజిస్ట్రేషన్ కు వెళ్తే క్రెడిట్ పాయింట్లు లేకపోతే చేయలేమని కౌన్సిల్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలను తాము తప్పక పాటించాల్సిందేనని వివరిస్తున్నారు. దీంతో కౌన్సిలింగ్ లిస్టులోని క్యాండిడేట్లలో కొందరు గందరగోళానికి గురి కావాల్సి వస్తున్నది. ఇదే విషయంలో కొందరు అభ్యర్ధులు కౌన్సిల్ ఆఫీసర్లను కూడా సంప్రదించగా, ఐఎన్ సీకి రిక్వెస్ట్ చేస్తామని అక్నడ్నుంచి పర్మిషన్ వస్తే రెన్యువల్ చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రాసెస్ జరిగే లోపే వెరిఫికేషన్ తేదీలు గడువు దాటిపోతే తమ భవిష్యత్ ఏమిటోనని కౌన్సిలింగ్ లిస్టులోని క్యాండిడేట్లు టెన్షన్ పడుతున్నారు.
అసలు ఏమిటీ క్రెడిట్ పాయింట్ల గందరగోళం?
భారతీయ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం, ప్రతి నర్సింగ్ అభ్యర్థి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నిర్ణీత గంటల పాటు వర్క్‌షాప్‌లలో పాల్గొనాలి.ఐదేళ్ల కాల పరిమితిలో కనీసం 150 గంటల సీఎన్ఈ పూర్తి చేసి ఉండాలి.ఈ గంటల ఆధారంగా వచ్చే క్రెడిట్ పాయింట్లు ఉంటేనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తామని కౌన్సిల్ చెప్తున్నది. అయితే కౌన్సిలింగ్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈ నిబంధనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.గతంలో కేవలం ఫీజు చెల్లిస్తే రెన్యువల్ అయ్యేదని, ఇప్పుడు అకస్మాత్తుగా క్రెడిట్ పాయింట్లు అడగడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Telangana Jobs: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీల భర్తీ . ఆ తేది నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
ఇక ఏఎన్ ఎం వాళ్లకూ ఈ రూల్
కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా సరిపడా వర్క్‌షాప్‌లు నిర్వహించలేదని, ఇప్పుడు పాయింట్లు ఎక్కడి నుండి తేవాలని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.వాస్తవానికి ఈ రూల్ ఐదేళ్ల క్రిందటనే ఐఎన్ సీ ప్రకటించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు దీనిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో అభ్యర్ధుల గందరగోళం నెలకొన్నది. ఇక ఏఎన్ ఎం వాళ్లకూ ఈ రూల్ వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంటుంది. గ్రామాల్లో పనిచేస్తున్నప్పటికీ రెన్యువల్ సమయంలో క్రెడిట్ పాయింట్లు పొందాల్సిందేనని కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఈ క్రెడిట్ విధానంపై ఆయా అభ్యర్ధుల్లో కనీస అవగాహన లేదు. కౌన్సిల్ కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
ఎలిమినేషన్ భయం?
ప్రస్తుతం మెడికల్ బోర్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తోంది. రెన్యువల్ లేని పక్షంలో తమను ప్రక్రియ నుండి తప్పిస్తారేమోనన్న భయం అభ్యర్థుల్లో నెలకొంది. స్టడీ, నర్సింగ్ సర్టిఫికేట్స్, కుల పత్రాలు వివరాలు, వ్యాలిడిటీ వంటి అంశాల్లో ఎక్కడా తప్పిదాలు ఉన్నా..బోర్డు ఆఫీసర్లు ఎలిమినేషన్ చేస్తారని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. అయితే నోటిఫికేషన్ అప్లై చేసే నాటికి నర్సింగ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీతో ఉంటే సరిపోతుందని ఓ అధికారి తెలిపారు. కానీ బీసీ నాన్ క్రిమిలేయర్ వంటి సర్టిఫికేట్లలో లేటెస్టు తెచ్చుకుంటే బెటర్ అంటూ వైద్యారోగ్యశాఖ లోని ఓ అధికారి తెలిపారు.కొత్త రూల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంశాల్లో మెడికల్ బోర్డు, నర్సింగ్ కౌన్సిల్ ఆఫీసర్లు సమన్వయమై ముందుకు సాగితే అభ్యర్ధుల్లో ఆందోళన, కన్ ప్యూజన్ ఉండదని ఓ నర్సింగ్ ఆఫీసర్ తెలిపారు.
Also Read: Samsung Galaxy S26 Plus: లాంచ్‌కు ముందు లీకైన Samsung Galaxy S26 Plus ఫీచర్లు

