Aruri vs Kadium: బీజేపీ నేత ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చీకట్లో బాణం వేస్తే అది సూటిగా తగలిందని.. దానికి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చిక్కారని.. కేటీఆర్ కూడా రంగ ప్రవేశం చేయడంతో బీజేపీని విడిచి పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని టార్గెట్ చేయడంలో భాగంగానే ఆరూరి ఎంట్రీ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు గురువుపై శిష్యుడిని పోటికి దింపితే కడియంను ఓడించవచ్చనే రాజకీయ వ్యూహం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అరూరి వస్తే స్టేషన్ ఘన్‌పూర్‌లో పోటీ చేయిస్తారా? అరూరి రమేష్ పోటీ చేస్తే మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఎర్రబెల్లి రాజకీయ చతురత పనిచేసేనా?
ఇటీవల వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తనతల్లి దశదిన కర్మ వేడుకకు అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ వేడుకలకు హాజరయ్యారు. మాటల సందర్భంలో యాదృచ్చికంగా అరూరిని పార్టీలోకి తిరిగి రావాలని ఎర్రబెల్లి ఆహ్వానించారు. దీంతో అదే అదనుగా భావించిన అరూరి సరే అనడంతో ఎర్రబెల్లి వెంటనే గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడించారు. ఫోన్ సంభాషణ ముగిసిన తరువాత తన అనుచరులతో అరూరి మంతనాలు సాగించి తిరిగి సొంతగూటికి చేరేందుకు సై అన్నారు. అరూరి రమేష్ ఈనెల 26న తన పార్టీ బీజేపీకి రాజీనామా చేస్తూ లేఖను పార్టీ పెద్దలకు పంపడమే కాకుండా మీడియాకు విడుదల చేశారు. అందులో తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, తన సొంత గూడు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున ముఖ్య నేతలు, క్యాడర్‌తో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎర్రబెల్లి రాజకీయ చతురత ఇప్పుడు జిల్లా రాజకీయాల దశ దిశను మార్చబోతుందనే టాక్ నడుస్తుంది.
కడియంను ఓడించాలనేనా..?
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల కింద కడియం శ్రీహరిని అనర్హునిగా ప్రకటించాలని బీ ఆర్ ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు అనర్హత కేసును స్పీకర్ ను నిర్ణయం తీసుకోవాలని సూచించడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరి అనర్హత ఫిటిషన్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ మాత్రం కడియం శ్రీహరి పై అనర్హత వేటు పడుతుందని, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని భావించి ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు కడియం శ్రీహరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు సాధ్యమైన మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఇప్పటికే తానే అభ్యర్ధినని కడియం శ్రీహరిని ఓడించి రాజకీయంగా భూస్థాపితం చేస్తానని ప్రతీనభూనుతున్నారు. కడియం శ్రీహరిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నమైన రీతుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు అరూరి రమేష్‌ను బీఆర్ఎస్లో చేర్చుకోవడం కూడా కడియం శ్రీహరిని ఓడించేందుకే అనే చర్చ సాగుతుంది.
గురువుపై ప్రతీకారం తీర్చుకునేందుకేనా?
కడియం శ్రీహరికి అరూరి రమేష్ శిష్యుడు. రాజకీయాల్లోకి కడియం శ్రీహరి ద్వారానే అరూరి వచ్చారని నాయకుల అభిప్రాయం. కడియం దగ్గర కాంట్రాక్టర్‌గా పనిచేసిన అరూరి రమేష్ జిల్లా రాజకీయాలను చక్రం తిప్పారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం, రెండుసార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అరూరి రమేష్ వాస్తవానికి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి స్థానికుడు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన వ్యక్తి. కడియం శ్రీహరి స్థానికేతరుడు కావడంతో అరూరి రమేష్‌ను బీఆర్ఎస్ నుంచి రంగంలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వినికిడి. గత పార్లమెంటు ఎన్నికల్లో అరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్ కు అవకాశం ఇచ్చారు. దీంతో మనస్థానం చెందిన అరూరి రమేష్ బీజేపీలో చేరారు. కడియం శ్రీహరి అదును చూసుకుని కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ కడియం కావ్యను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Also Read: Deputy CM Bhatti Vikramarka: దివ్యాంగుల కోసం ప్రభుత్వం రెండేళ్లలో రూ.100 కోట్లు ఖర్చు చేసింది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క!
తాటికొండ రాజయ్య పరిస్థితి ఏంటీ?
ఆరూరి రమేష్‌కు బీఆర్ఎస్ లో అవకాశం లేకుండా చేశారనే కోపం కడియం శ్రీహరిపై ఉందనేది టాక్. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోనే రాజకీయ చాణక్యుడిగా పేరున్నకడియం శ్రీహరిని స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓడించాలంటే అరూరి రమేష్ ధీటైన అభ్యర్థిగా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అంగబలం, అర్ధబలం, కుల బలం పైగా స్థానికుడు అయిన అరూరి రమేష్‌ను రంగంలోకి దింపితే కడియం ఓడిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. అరూరి రమేష్ రంగంలోకి దిగితే స్టేషన్ ఘన్పూర్ లో పోటీ రసవత్తరంగా సాగుతుందని అదే రాజయ్య అయితే కడియం గెలుపునకు ఎదురులేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అందుకే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలు అరూరి రమేష్ ను వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్లో చేర్పించే పనిలో పడ్డారని వినికిడి. అరూరి రమేష్ రాకతో తాటికొండ రాజయ్య పరిస్థితి ఏమిటనేదే ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాధారణ ఎన్నికల్లోనే మొండిచేయి చూపిన ఆధిష్టానం, ఇంతకాలం పార్టీ కోసం పనిచేసి ఉప ఎన్నికలొస్తే పోటీ చేద్దామనుకుంటే ఇప్పుడు అరూరి రమేష్ రూపంలో మరోసారి మొండి చేయి తప్పెటట్టు లేదు. ఏదేమైనా అరూరి రాకతో ఇటు కడియం శ్రీహరి, అటు తాటికొండ రాజయ్య శిభిరంలో ఆందోళన మొదలైనట్టే.

