Tirumala Laddu Case: పరమ పవిత్రమైన తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారంటూ వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘ విచారణ అనంతరం 600 పేజీల చార్జ్ షీట్ ను నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు ఇటీవల సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి ఏకంగా 36 మందిని నిందితులుగా చేర్చింది. డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ మాజీ ఉద్యోగులు, డైరీ నిపుణులు ఇందులో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ నివేదిక ఏపీలో రాజకీయ వేడిని రగిలించింది. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదిక తేల్చినప్పటికీ వైసీపీ తన వింత వాదనతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
సిట్ రిపోర్ట్‌లో ఏముందంటే?
నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ కీలక విషయాలు ప్రస్తావించింది. బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని.. నెయ్యి తయారీలో పాలనే ఉపయోగించలేదని సిట్ పేర్కొంది. పామాయిల్ లో వివిధ రకలా రసాయనాలు కలిపి నెయ్యిని పోలిన మిశ్రమాన్ని తయారు చేశారని.. దానిని ఏఆర్ డైరీ, వైష్ణవీ డైరీల ద్వారా తిరుమలకు సరఫరా చేశారని సిట్ దర్యాప్తులో నిర్ధరణ అయ్యింది. దాదాపు 68 లక్షల కిలోల ఈ కల్తీ మిశ్రమంతో 20 కోట్ల శ్రీవారి లడ్డులను తయారు చేసినట్లు సిట్ నివేదిక పేర్కొంది. ఈ కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి రూ.251 కోట్ల వరకూ చెల్లింపులు జరిగినట్లు సిట్ తన చార్జీ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి 36 మందిని నిందితులుగా చేర్చింది. అందులో డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు ఉండటం గమనార్హం.
వైసీపీ వింత వాదన!
అయితే గతంలో తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని తెరపైకి తెస్తూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేశారు. అయితే సిట్ రిపోర్టులో మాత్రం జంతు కొవ్వు కలిసినట్లు ఎక్కడా నివేదించలేదు. ప్రస్తుతం దీనినే వైసీపీ తన ఆయుధంగా మార్చుకుంటోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ఆరోపించారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. దేశ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కారణంగా వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం వనదేవతల చెంత విదేశీల వీర నృత్యం.. సీతక్క చొరవతో అంతర్జాతీయ కళా వైభవం!
కల్తీ అయితే జరిగింది కదా!
మరోవైపు టీడీపీ, జనసేన నేతలు సైతం సిట్ నివేదికకు సంబంధించి ఎదురు దాడికి దిగుతున్నారు. తెలివిగా జంతువుల కొవ్వు అంశాన్ని పక్కన బెట్టి.. నెయ్యి కల్తీ వాస్తవమేనని సిట్ చెప్పడాన్ని హైలెట్ చేస్తున్నారు. మెుత్తంగా ఇప్పుడు.. అధికార, విపక్ష పార్టీల మధ్య శ్రీవారి లడ్డు కల్తీ అంశం తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎంతగా లాగితే అంత వైసీపీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జంతు కొవ్వు అంశాన్ని కాస్త పక్కన పెడితే.. నెయ్యి కల్తీ జరిగిందన్నది మాత్రం నిజమేనని సిట్ రిపోర్టు కూడా తేల్చేసిందని గుర్తుచేస్తున్నారు. జగన్ హయాంలో శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందన్నది నిజమని పేర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వం అవినీతి లేదా వైఫల్యం కారణంగా శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందని ఆరోపిస్తున్నారు.

