Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతర ఇప్పుడు ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతోంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు, పర్యాటకులకు, ఆదివాసీ తెగలకు ఒక గొప్ప వేదికైంది. సోమవారం మేడారం గడ్డపై ఒక అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. న్యూజిలాండ్‌కు చెందిన సుప్రసిద్ధ ‘మావోరి’ తెగ ప్రతినిధులు వనదేవతలను దర్శించుకోవడమే కాకుండా, తమ వీరత్వాన్ని చాటే సంప్రదాయ ‘హాకా’ నృత్యంతో గద్దల ప్రాంగణాన్ని హోరెత్తించారు.
అబ్బురపడ్డ భక్తులు
తెలంగాణ-న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ బృందం మేడారం విచ్చేసింది. మావోరి తెగ ప్రతినిధులు గద్దల ప్రాంగణంలో తమ సంప్రదాయ యుద్ధ నృత్యమైన ‘హాకా’ను ప్రదర్శిస్తుంటే భక్తులు ఆశ్చర్యంతో తిలకించారు. ‘హాకా’ మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించేందుకు చేసే నృత్యం. కళ్లను పెద్దవి చేస్తూ, నాలుకను బయటకు చాస్తూ, రొమ్ముపై చేతులతో చరుస్తూ గంభీరమైన స్వరంతో వారు చేసిన ప్రదర్శన గద్దల ప్రాంగణంలో ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించింది.
మావోరిలతో కలిసి సీతక్క స్టెప్పులు
ఈ అద్భుత ఘట్టంలో మంత్రి సీతక్క (Sammakka) స్వయంగా కళాకారులతో కలిసి అడుగులు వేశారు. ఆదివాసీ సంస్కృతిలో భాగమైన ఈ వీర నృత్యాన్ని ఆమె వారితో కలిసి చేయడం చూసి అక్కడి వారు హర్షధ్వానాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆదివాసీలు అడవిని, ప్రకృతిని దైవంగా భావిస్తారని చెప్పారు. మేడారం వైభవం నేడు సప్త సముద్రాలు దాటిందనడానికి ఈ మావోరి బృందం రాకనే నిదర్శనం అని సీతక్క పేర్కొన్నారు.
చరిత్రపై ఆసక్తి
అనంతరం మంత్రి సీతక్క మావోరి బృందాన్ని గద్దల వద్దకు తీసుకువెళ్లి అమ్మవార్ల దర్శనం చేయించారు. సమ్మక్క-సారలమ్మల వీరగాథను, వారు అడవి కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాన్ని వారికి వివరించారు. ఈ చరిత్ర విన్న విదేశీ ప్రతినిధులు అబ్బురపోయారు. గిరిజన సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న గొప్పతనాన్ని కొనియాడారు. జిల్లా యంత్రాంగం తరపున వారికి సమ్మక్క-సారలమ్మల ప్రసాదం మరియు ‘బంగారం’ (బెల్లం) అందజేసి మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. జాతరలో ఆ భయం లేదిక..?

