Medaram Jatara 2026: మేడారంలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్
Medaram Jatara 2026 (Image credit: swetcha reporter)
Telangana News

Medaram Jatara 2026: మేడారంలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్.. రూ.6 కోట్లతో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్లాన్!

Medaram Jatara 2026: మేడారంలో రూ.6 కోట్లతో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ఆర్ధిక చేయూత కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. మేడారానికి వచ్చే భక్తులకు పూజాసామాగ్రితో పాటు నిత్యాసరాలు సరసమైన ధరలకు అందించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచబోతున్నారు. ఇప్పటికే స్టాల్స్ కూడా ప్రారంభించారు.

మహిళాభ్యున్నతికి సర్కార్ ప్రాధాన్యత

మహిళాభ్యున్నతికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవకాశంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించేందుకు ఇందిరా మహిళా శక్తి ద్వారా రూ.6 కోట్ల వ్యయంతో 565 షాపులను ప్రభుత్వం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 37 లొకేషన్లలో 27 రకాల వ్యాపారాలను మహిళలు నిర్వహించనున్నారు. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్స్, మేడారం రాకపోకలు జరిగే మార్గంలో 63 యూనిట్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన యూనిట్స్ ఇతర చోట్ల నెలకొల్పారు.

Also Read:

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా

ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెర్ప్ బ్యాంకు లింకేజీతో రూ.341.30లక్షలతో 315 యూనిట్స్, సెర్ప్ సీఐఎఫ్ నిధులురూ.86.50 కోట్లతో 80 యూనిట్లు, స్త్రీ నిధి రూ.92లక్షలతో 90 యూనిట్లు, మండల సమాఖ్య సీఐఎఫ్ రూ.64 లక్షలతో 60 యూనిట్లు, గ్రామ సమాఖ్య నిధులు రూ.19.50 లక్షలతో 20 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మేడారం జాతర సందర్బంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ ద్వారా ఈ ప్రాంత సంఘాల మహిళలు లబ్ది పొందనున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇప్ప పువ్వు లడ్డులు, మిల్లెట్ లడ్డులు, రాగి లడ్డులు, పల్లీ లడ్డులు విక్రయ స్టాల్స్, ఇప్ప నూనె, కోల్డ్ ప్రెస్ ఆయిల్ , కారం, పసుపు, మసాలా యూనిట్స్, రాగి జావ, టీఫిన్లు, రొట్టెల యూనిట్, మిల్లెట్ షేక్, స్వీట్ కార్న్, పాప్ కార్న్, టీ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు, పూజా సామాగ్రీ విక్రయ స్టాల్స్ తో పాటు బేకరీ, బ్యాంబు చికెన్, చికెన్, క్లాత్ రెడీ మేడ్ డ్రెస్సెస్, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహార, కిరాణా జనరల్ స్టోర్, కూల్ డ్రింక్స్, పాలు, ఫాస్ట్ ఫుడ్, మొబైల్ ఫిష్, కర్రీ అవుట్ లెట్, కోళ్ల విక్రయ అవుట్ లెట్, కోడి గుడ్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుంది.

మహిళలకు ఉపాధి : మంత్రి సీతక్క

జాతరకు వచ్చే భక్తులకు సరమైన ధరలకు నిత్యావసరాలతో పాటు పూజా సామగ్రిని అందజేసేందుకు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్టాల్స్‌తో మేడారం పరిసర ప్రాంతాల మహిళలకు ఉపాధి లభించనుంది. వారిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో రూ. 6 కోట్లతో 565 స్టాల్స్ ఏర్పాటు చేశాం.

రూ.50 కోట్ల నిధులతో స్నాన ఘట్టాలు

జాతరకు హాజరయ్యే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ గత జాతరలకన్నా అదనపు ఏర్పాట్లను చేసింది. ప్రధానంగా రెడ్డిగూడెం నుండి జంపన్న వాగు మీదుగా చిలకలగుట్ట వరకు నీటి మట్టాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జంపన్న వాగులో ఉన్న 29 ఇంఫిలిట్రేషన్ వెల్స్‌ల పూడికను చేపట్టింది. స్నాన ఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ (బీఓటీ)లను పురుద్దరించడంతోపాటు బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లకు నిరంతర నీటిని అందించేందుకు ఇంఫిల్టరేషన్ వెల్స్‌లో సుబ్మెర్సిబుల్ పంపులను ఏర్పాటు చేసి పైప్‌లైన్లను నీటిపారుదల శాఖ చేపట్టింది. నీటిపారుదల శాఖ ద్వారా దాదాపు రూ.50 కోట్ల నిధులతో భక్తులకు ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగు పొడుగునా 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లను, 119 డ్రస్ చెంగింగ్ రూమ్ లను, జంపన్న వాగులో నీటి మట్టాన్ని ఒకే తీరుగా ఉంచేందుకు 9 క్రాస్ బండ్ లను నిర్మించారు. వీటితోపాటు, జంపన్న ఘాట్ లపై ఉన్న మెట్ల మరమత్తులు, జంపన్న వాగులో జలాలు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేపడుతున్నారు.

అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు

తాడ్వాయి మండలంలో దట్టమైన అడవిలో జరిగే ఈ మేడారం జాతర సందర్బంగా అటవీ సంరక్షణతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా, అటవీ సంపద ధ్వంసం కాకుండా ఉండేందుకు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాణాల నివారణ, దట్టమైన అడవుల గుండా వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రించడం లాంటి పనులను అటవీ శాఖ చేపట్టింది. వీటితోపాటు, ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది.

నిరంతర విద్యుత్ సరఫరాకు 196 ట్రాన్ ఫార్మర్లు

మేడారం జాతరలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖ, 24 గంటలూ ఏ ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 911 ఎలక్ట్రిక్ స్తంభాలు, 196 ట్రాన్ ఫార్మర్లు ఏర్పాటు చేసి వీటి నిర్వహణకు 350 అదనపు సిబ్బందిని నియమించింది. వీటితో పాటు, 43 పార్కింగ్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే, జాతర ప్రాంతంలో ఉన్న 11 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్‌లను సిద్ధం చేసింది. భక్తుల రక్షణ చర్యల్లో భాగంగా, 11 కేవీ, 33 కేవీ లైన్లు క్రాస్ అయ్యే జంపన్న వాగు వద్ద ఆరు గస్తీ టవర్లను ఏర్పాటు చేశారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. తాడ్వాయి, పస్రా మార్గంలో పెట్రోలింగ్ టీమ్‌లను కూడా నియమించారు. నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లకు ఒక బృందం చొప్పున(ఏఈ, ముగ్గురు ఆపరేషన్‌ సిబ్బంది) పర్యవేక్షించనుంది. 33 కేవీ లైన్స్‌ పర్యవేక్షణకు తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట, చెల్పూర్‌, ఏటూరునాగారం, కమలాపూర్‌, ములుగు సబ్‌స్టేషన్‌ల పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఇవే ప్రాంతాల్లోని ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ల వద్ద విద్యుత్‌ సరఫరా పర్యవేక్షించేందుకు 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.. అత్యవసర పనుల కోసం సామగ్రిని తరలించేందు కు 30 వాహనాలను కేటాయించారు.

Also Read: Medaram Jatara 2026: మేడారం మహా జాతరకు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఈసారి ప్రత్యేకతలివే..!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?