Medaram Jatara 2026: మేడారం మహా జాతర.. తెలంగాణ అడవుల్లో జరిగే మన కుంభమేళా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకు జరిగే ఈ సంబురానికి కోట్లాది మంది భక్తులు మేడారానికి తరలి వస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగు రోజులపాటు శివసత్తుల పూనకాలు, కోయ దొరల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ. ఈ ఏడాది మేడారం జాతరను ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తున్నది. ముఖ్యంగా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
రంగంలోకి పంచాయతీ రాజ్ సిబ్బంది
ఈ నేపథ్యంలో జాతర ప్రాంగణం, మేడారం గ్రామం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జాతర నిర్వహణలో కీలకమైన పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖకు చెందిన సిబ్బందిని రంగంలోకి దిగారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో జాతరను నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నది.
బాధ్యత కాదు.. సేవగా భావించాలి
సమ్మక్క సారలమ్మ మహా జాతర కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడిన మహోన్నత కార్యక్రమం అని మంత్రి సీతక్క తెలిపారు. ఇలాంటి పవిత్రమైన జాతరలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పరిశుభ్రమైన మేడారాన్ని చూడాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందిని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. ప్రతి అధికారి, సిబ్బంది దీనిని ఒక బాధ్యతగా కాకుండా సేవగా భావించి విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఇతర జిల్లాల నుంచి అనుభవజ్ఞులైన డీపీవోలు, డీఎల్పీవోలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులను జోనల్, సబ్ జోనల్, సెక్టోరల్, సబ్ సెక్టోరల్ అధికారులుగా నియమించారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు పంచాయతీ రాజ్ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం విధులు నిర్వహించనున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
పరిశుభ్రత నిర్వహణ కోసం జోనల్ నుంచి సబ్ సెక్టార్ స్థాయి వరకు వందల సంఖ్యలో అధికారులతో పాటు వేలాది మంది కార్మికులు పని చేయనున్నారు. రెండు షిఫ్టుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు కొనసాగుతాయి. వీరితో పాటు బ్లీచింగ్, స్ప్రేయింగ్, వ్యర్థాల సేకరణ, మీట్ వేస్ట్ మేనేజ్మెంట్, డంప్ యార్డుల నిర్వహణ వంటి పనులకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్వీపింగ్ వాహనాలు, ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు నిరంతరం అందుబాటులో ఉంచేలా ప్రత్యేక బృందాలను నియమించారు.
Also Read: Ramchander Rao: నైనీ టెండర్ల రద్దు వెనుక అసలు రహస్యం అదే.. బీజేపీ నేత రాంచందర్ రావు!
అవసరమైతే మరింత మంది సిబ్బంది
గద్దెలు, దేవాలయ ప్రాంగణం, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, క్యూ లైన్లు, హరిత హోటల్ ప్రాంతం, ఐటీడీఏ క్యాంపు, చిలుకల గుట్ట, పోలీస్ క్యాంపులు, జంపన్న వాగు పరిసరాలు, బస్టాండ్, వీఐపీ పార్కింగ్ ప్రాంతాలు సహా భక్తుల రాకపోకలు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణ, ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నారు. అందు కోసం జోనల్ ఆఫీసర్లుగా 21 మంది డీపీఓలను, సబ్ జోనల్ ఆఫీసర్లుగా 42 మంది డీఎల్పీఓలను నియమించారు. అలాగే, సెక్టార్ ఆఫీసర్లుగా 83 మంది ఎంపీఓలను, సబ్ సెక్టార్ ఆఫీసర్లుగా 480 మంది పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఫీల్డ్ స్థాయిలో 9 వేల మంది కార్మికులను వినియోగిస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైతే మరింత మంది సిబ్బందిని రంగంలోకి దించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కోట్లాది మంది భక్తుల భక్తి, విశ్వాసంతో ముడిపడిన ఈ మహా జాతరలో ప్రత్యేక పరిశుభ్రతా చర్యలు చేపట్టి మేడారం జాతరను విజయవంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతు్నదని పేర్కొన్నారు.
ప్రత్యేకతలు
– మేడారం మహా జాతరలో ప్రత్యేక పరిశుభ్రతా చర్యల కోసం విధుల్లో వేల మంది సిబ్బంది
– పొరుగు జిల్లాల పంచాయతీ రాజ్ సిబ్బందికి కూడా బాధ్యతలు
– జోనల్ అధికారులుగా 21 మంది డీపీఓలు
– సబ్ జోనల్ అధికారులుగా 42 మంది డీఎల్పీఓలు
– సెక్టార్ అధికారులుగా 83 మంది ఎంపీఓలు
– సబ్ సెక్టార్ అధికారులుగా 480 మంది పంచాయతీ కార్యదర్శులు
– 9,000 మంది కార్మికులు
జాతర నాలుగు రోజులు ఏం చేస్తారంటే?
మొదటి రోజు: కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకుని వస్తారు
రెండో రోజు: చిలుకల గుట్టలోని కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మకకు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు.
మూడో రోజు: సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదరి భక్తులకు దర్శనం
నాలుగో రోజు: సాయంత్రం సమయంలో ఆవాహన పలికి తిరిగి వన ప్రవేశం
Also Read: Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు

