Thimmapur Election Scam: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా(Yadadri District) అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బస్వాపురం రిజర్వాయర్‌లో బిస్ తిమ్మాపూర్(Bis Thimmapur) పూర్తిగా మునిగిపోయింది. ఆ గ్రామం ఆనవాళ్లు కూడా నీళ్లలో కలిసి పోయాయి. కానీ, ఆ గ్రామానికి ఇప్పుడు పాత ఓటర్ లిస్టుతో నోటిఫికేషన్ విడుదలైంది. అంతేకాదు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎడ్ల వెంకట్ రెడ్డి(Edla Venkat Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు! దీన్ని అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలింది. అలా ఎలా చేస్తారని ‘స్వేచ్ఛ’ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేసింది. దీంతో తిమ్మాపూర్ గ్రామం పేరు చెప్పుకుని డబ్బులు తినేయడానికి భారీ స్కెచ్ వేసినట్లుగా తేలింది. నిజానికి ఆ గ్రామస్తులంతా పునరావాస కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓటు హక్కులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊరు లేకున్నా, అందులో జనం లేకున్నా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికవ్వడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎన్నిక కూడా పంచాయితీరాజ్ యాక్ట్‌కు విరుద్దమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
రూ.23 కోట్ల కోసం డ్రామాలు
పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 3, 4, 268 ప్రకారం ముప్పు గ్రామాల్లో జనాలు లేనందున ఎన్నికలు నిర్వహించవద్దని స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 243 (ఈ), 243 (కే), ముప్పునకు గురైన గ్రామాల్లో ఎన్నికలు ఏంటి? అంటూ తెలంగాణ హైకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. కానీ నష్టపరిహారంపై కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంకా రూ.23 కోట్లు రావాల్సి ఉందని ముప్పు బాధితులు భావిస్తున్నారు. అవి రావాలంటే సర్పంచ్ ఉండాలని గ్రామస్తులు నోటిఫికేషన్ రాగానే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికే ఆ గ్రామాన్ని పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ గ్రామంగా ప్రకటించినట్లు సమాచారం.
Also Read: MLC Kavitha: పెద్దల ఇళ్లను కూడా కూల్చేయండి.. హైడ్రా కమిషనర్‌కు కవిత సూటి ప్రశ్న
155 ఎకరాల్లో పునరావాసం
ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గ్రామ పరిధిలోని భూములతో పాటు, గృహ ఆవాసాలు, వ్యవసాయ భూములు, చెట్లు, బావులు అన్నింటినీ ప్రభుత్వం సర్వే డీఎన్‌డీ నోటిఫికేషన్ గతంలో జారీ చేసింది. తిమ్మాపురం గ్రామ ప్రజలకు సుమారు 156 ఎకరాల ప్రభుత్వ భూములు సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. భువనగిరి మున్సిపాలిటీలో 200 గజాల చొప్పన స్థిర నివాసాలు ఏర్పాటు చేశారు. వెయ్యి యాభై కోట్లు పరిహారాలను చెల్లించినట్లు కాగ్ రిపోర్ట్(Cag Report) స్పష్టం చేసింది. తిమ్మాపురం గ్రామం పరిధి ప్రభుత్వ ఆధీనంలో వచ్చింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 3 (2), 4 ప్రకారం గ్రామ పంచాయతీని రద్దు చేయడం, పునరావాసం కల్పిస్తున్న భువనగిరి మున్సిపాలిటీలోకి విలీనం చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారని తెలుస్తున్నది. ఇవన్నీ పక్కన పెట్టి నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల వెంకటరెడ్డి(Edla Venkat Reddy) ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మేమంతా ఇంకా తిమ్మాపురం గ్రామ ప్రజలమా? లేదా ప్రభుత్వం కల్పించిన మున్సిపాలిటీ పరిధిలో వాళ్లమా? మా భవిష్యత్‌లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తామా? అంటూ అనేక ప్రశ్నలు ఆ ఓటర్లను తొలుస్తున్నాయి. ఒకవేళ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగితే ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. సర్పంచ్ పదవి హోదా ఫండ్స్ కోసం వాడుకుంటారా? పనులు చేయకుండానే బిల్స్ కూడా ఎత్తేస్తారా? నీళ్లలో రోడ్లు చూపిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే ఐలయ్య వదిలేశారు..
ప్రతి గ్రామంలో కాంగ్రెస్(Congress) మద్దతుతో ఉండే అభ్యర్థి గెలువాలని అధిష్టానం చెబుతుంటే డీసీసీ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(MLA Beerla Ailaiah) మాత్రం బీఆర్ఎస్(BRS) మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా పట్టించుకోవడం లేదు. అసలు గ్రామమే భౌతికంగా లేనప్పుడు ఎలా చేస్తారు? అని అధికారులను కనీసం అడగడం లేదు. యాదాద్రి జిల్లా కలెక్టర్ స్పందించి గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నిర్లక్ష్యం రేపు వార్తలతో పాటు వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా ప్రకటించక ముందే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అర్బన్ పార్క్ దుప్పుల వేట కేసులో లొంగిపోయిన నిందితుడు

