MLC Kavitha: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పెరికి చెరువును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పరిశీలించారు. దాదాపు 62 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన ఈ చెరువు సగానికి పైగా కబ్జాకు గురై ప్రస్తుతం కేవలం 16 ఎకరాలకే కుదించుకుపోవడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘చుట్టుపక్కల ప్రజలు చెరువు పరిరక్షణ కోసం ఎన్నో కేసులు పెట్టినా, పొలిటికల్ మేనేజ్‌మెంట్ చేస్తూ చెరువును తినేశారు. ఈ కబ్జాలో అన్ని పార్టీల వాళ్లు ఉన్నారు’ అని కవిత ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే గతంలో టీడీపీ(TDP)లో ఉండి బీఆర్‌ఎస్(BRS)లోకి వచ్చారని, రేపు ఎక్కడ ఉంటారో తెలియదని పేర్కొంటూ, ఆయన అండదండలతోనే చెరువు కబ్జా జరిగిందని మండిపడ్డారు. ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పహానీలు చూస్తే ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్లు చూపిస్తున్నా, నిర్మాణాలకు ఎలా అనుమతిస్తున్నారని కవిత ప్రశ్నించారు.
రియల్ ఎస్టేట్ మాఫియా భయం
ఎఫ్‌టీఎల్(FTL) అని రాసి ఉన్న రాళ్లను కూడా రియల్ ఎస్టేట్ మాఫియా భయం లేకుండా తీసేసిందని, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చాలా ఇళ్లు ఎఫ్‌టీఎల్ లోనే కడుతున్నారన్నారు. హై(Hydraa)డ్రా కమిషనర్ రంగానాథ్ వాటిని కూల్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పేదవాళ్ల ఇళ్లే కాదు, పెద్ద వాళ్ల ఇళ్లను కూడా కూల్చేస్తామని మెసేజ్ ఇవ్వాలని కవిత అన్నారు. అపార్ట్‌మెంట్లకు పార్క్ స్థలాన్ని రియల్ ఎస్టేట్ మున్సిపల్‌కు గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిన నియమాన్ని కూడా ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని, రియల్ ఎస్టేట్ మాఫియాతో ఎందుకు అంత అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలని మున్సిపల్ అధికారులను నిలదీశారు. పెరికి చెరువును కాపాడటంలో తాను ముందుంటానని, హైడ్రా కమిషనర్ కూడా ఈ చెరువును కాపాడాలని ఆమె కోరారు.
బలిదానాలు వద్దు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ చారి(Sai Ishwar Chari) ఘటన తనను కలచివేసిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న ఈశ్వర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన కవిత, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే చారి ఆత్మహత్య చేసుకున్నారని ఆమె అన్నారు. చారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కవిత పేర్కొన్నారు. బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని స్పష్టం చేస్తూ, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అందరూ కలిసి ఐక్య పోరాటాలు చేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు.
Also Read: IndiGo Flight Crisis: ఇండిగో తప్పు చేసింది.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. విమానయాన మంత్రి వార్నింగ్

