Huzurabad News: ప్రభుత్వ లక్ష్యం గొప్పదే కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం ఆ లక్ష్యాన్ని అపహాస్యం చేస్తోంది. హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి(Bornapally), అహల్య నగర్ రోడ్ నెంబర్ 4లో గత వారం రోజులుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు ఏరులై పారుతోంది. చుక్క చుక్కా పొదుపు చేయాలని ఒకవైపు ప్రచారాలు చేస్తున్న యంత్రాంగం, కళ్లముందే వందల గ్యాలన్ల నీరు వృథాగా పోతున్నా కనీసం కన్నెత్తి చూడకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. గత వారం క్రితం పైప్‌లైన్ లీకేజీ ప్రారంభమవ్వగా, రోజురోజుకూ దాని తీవ్రత పెరుగుతోంది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపు పగిలిన చోట గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి..
ఈ విషయమై స్థానిక ప్రజలు మున్సిపల్(Muncipal) సిబ్బందికి, మిషన్ భగీరథ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. “సమస్య మా దృష్టికి రాలేదు” అనో లేదా “రేపు చూస్తాం” అనో కాలయాపన చేస్తూ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వార్డు ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికీ తాగునీరు అందించాలని చూస్తుంటే, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ నీరు డ్రైనేజీ పాలవుతోంది. ఒకవైపు ఎండలు ముదురుతుంటే, నీటి విలువ తెలిసిన ప్రజలు ఈ వృథాను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బోర్నపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Also Read: BSNL: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కొత్త యాప్ ప్రారంభం.. కస్టమర్ ఆన్‌బోర్డింగ్ కోసం సంచార్ మిత్ర

