Delhi Air Pollution: రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అమలు చేస్తున్న ‘నో పీయూసీ, నో ఫ్యూయల్’ ప్రత్యేక డ్రైవ్ కు మంచి రిజల్ట్ ఇస్తోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో 3,746 వాహనాలకు చలాన్లు విధించగా, 568 నిబంధనలు పాటించని వాహనాలను ఢిల్లీ సరిహద్దుల వద్దే వెనక్కి పంపినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు.
Also Read: Thummala Nageswara Rao: పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
డ్రైవ్ మొదటి రోజునే ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ సంయుక్త బృందాలు రాజధాని ప్రవేశ ద్వారాల వద్ద సుమారు 5,000 వాహనాలను తనిఖీ చేశాయి. చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC) లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక గమ్యం లేని లేదా నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన 217 ట్రక్కులను ఢిల్లీకి ప్రవేశం కల్పించకుండా ఈస్ట్రన్, వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల వల్ల బయటి రాష్ట్రాల నుంచి అనవసర వాహనాల రాక గణనీయంగా తగ్గిందని మంత్రి సిర్సా పేర్కొన్నారు.
ఈ డ్రైవ్ ప్రారంభం తర్వాత PUCCల డిమాండ్ భారీగా పెరిగింది. డిసెంబర్ 17, 18 తేదీల్లోనే 61,000కు పైగా ఎమిషన్ సర్టిఫికెట్లు జారీ కావడం ప్రజల్లో అవగాహన, సహకారం పెరుగుతున్నట్టు సూచిస్తోందని అధికారులు చెప్పారు. తీవ్రమైన వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో వాహనాల వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రోడ్డు దుమ్ము, పరిశ్రమల కాలుష్యం, చెత్త నిర్వహణపై కూడా సమాంతరంగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. వాహన యజమానులు తప్పనిసరిగా తమ ఎమిషన్ సర్టిఫికెట్లు సవరించుకోవాలని, లేదంటే జరిమానాలు, ప్రయాణ అంతరాయాలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read: Double Murder: అమ్మానాన్నలను చంపేసి.. రంపంతో ముక్కలుగా కోసి.. ఓ దుర్మార్గుడు చేసిన దారుణమిది!

