Double Murder: మతాంతర వివాహం చేసుకున్నాడు.. అమ్మానాన్నలు తిరస్కరించడంతో భార్యను వదిలేశాడు.. అందుకుగానూ, భరణం చెల్లించేందుకు డబ్బు కావాలంటూ తల్లిదండ్రులను కోరాడు. వారు ఇవ్వకపోవడంతో ప్రాణం ఇచ్చినవారిపై పగ పెంచుకొని కిరాతకంగా హత్య చేశాడు. దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) జౌన్‌పూర్‌లో (Double Murder) జరిగింది.
వృద్ధ దంపతుల మిస్సింగ్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే సంచలనాలు వెలుగుచూశాయి. శ్యామ్ బహదూర్ (62), బబిత (60) అనే వృద్ధ దంపతులను వారి కొడుకే హత్య చేశాడు. ఇంజనీర్‌గా పనిచేస్తున్న అంబేష్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా కన్నవారిని చంపేశాడని పోలీసులు గుర్తించారు. హత్య చేసి, శవాలను రంపంతో ముక్కలుముక్కలుగా కోసి నదిలో పారేశాడు. ఈ షాకింగ్ ఘటనలో నిందితుడు అంబేష్‌ను పోలీసులు (Crime News) అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు గురైన వృద్ధుడు శ్యామ్ బహదూర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఏకైక కొడుకు అంబేష్ ఉన్నారు. నిందితుడు అంబేష్‌కు ఐదేళ్ల క్రితం ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఈ పెళ్లిని అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు. కోడలిని ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, భార్యను వదిలేయాలంటూ కొడుకుని తండ్రి ఒత్తిడి చేసేవాడు. చివరికి తండ్రి మాట విన్న అంబేష్, తన భార్యతో విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య కూడా అంగీకరించింది. కానీ, రూ.5 లక్షల భరణం కావాలంటూ ఆమె డిమాండ్ చేసింది.
Read Also-Nidhhi Agarwal: లూలూమాల్ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. మాల్ యాజమాన్యంపై సుమోటో కేసు..
భరణం చెల్లించేందుకు డబ్బు కావాలంటూ తల్లిదండ్రులను అంబేష్ అడిగాడు. ‘మీ కోరిక మేరకే భార్యకు విడాకులు ఇస్తున్నాను కాబట్టి, భరణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలి’ అని తండ్రి వద్ద పట్టుబట్టాడు. ఇదే విషయమై డిసెంబర్ 8న తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఎంతకీ డబ్బు ఇవ్వబోనంటూ తండ్రి తెగేసి చెప్పడంతో అంబేష్ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న రుబ్బు రోలుతో తొలుత తల్లి బబిత తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయడంతో, తండ్రి శ్యామ్ బహదూర్ సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. దీంతో, వెంటనే తండ్రి తలపై అంబేష్ రోలుతో మోదాడు. బలంగా కొట్టడంతో వృద్ధ దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జంట హత్యల తర్వాత శవాలు ఎవరి కంటా పడకుండా ప్రయత్నించాడు. డెడ్‌బాడీలను తీసుకెళ్లి పడేయడానికి పెద్ద సంచులు దొరకకపోవడంతో, అందుబాటులో ఉన్న చిన్నపాటి సంచుల్లో పట్టేలా శవాలను రంపంతో ముక్కలుగా కోశాడు. ఆరు ముక్కలుగా నరికి, సంచుల్లో నింపి, కారు డిక్కీలో పెట్టుకుని తెల్లవారుజామున ఒక నదిలో విసిరివేశాడు.
కుమార్తె ఫిర్యాదుతో వెలుగులోకి
తల్లిదండ్రులు కనిపించకపోవడంతో వారి ముగ్గురు కూతుళ్లలోని ఒకరైన వందనకు అనుమానం వచ్చింది. అంబేష్ ఆమెకు ఫోన్ చేసి, అమ్మనాన్న తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయారంటూ నమ్మబలికే ప్రయత్నం చేశాడు. వారిని వెతకడానికి వెళ్తున్నానంటూ డ్రామాలు ఆడాడు. కానీ, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో, సోదరి వందనకు అనుమానం వచ్చి, డిసెంబర్ 13న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అమ్మానాన్నలు కనిపించడం లేదని పేర్కొంది. దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు అంబేష్‌ను స్టేషన్‌కు పిలిపించి, తమదైన స్టైల్‌లో ప్రశ్నించగా, నిజాలు కక్కాడు. జరిగిన దారుణాన్ని వివరించాడు. దీంతో, వృద్ధ దంపుల మృతదేహాల భాగాల కోసం నదిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
Read Also- G Ram G Bill: పంతం నెరవేర్చుకున్న కేంద్రం.. లోక్‌సభలో జీ రామ్ జీ బిల్లుకు ఆమోదం

