Minor Girl Abuse: దోషిగా తేలిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధింపు
Minor Girl Abuse: విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన గురువే దారి తప్పాడు. విద్యా బుద్దులు నేర్పించాల్సిందిపోయి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా (Minor Girl Abuse) ప్రవర్తించాడు. దాదాపు 9 ఏళ్లక్రితం జరిగిన ఈ ఘటనలో మేడ్చల్ కోర్టు గురువారం నాడు కీలక తీర్పు వెలువరించింది. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదవ్వగా, దోషిగా తేలిన సురేష్ అనే వ్యక్తికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఫర్ ట్రైయల్ ఆఫ్ రేప్ అండ్ పోక్సో యాక్ట్ కేసెస్ మేడ్చల్ కోర్టు జడ్జి తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి వెంకటేష్ ఈ తీర్పు ఇచ్చారు.
అసలేం జరిగింది?
ఈ ఘటనకు సంబంధించిన పూర్వ వివరాల్లోకి వెళితే.. 2016లో పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దోషిగా తేలిన సురేష్ అనే వ్యక్తి పీఈటీ టీచర్‌గా పనిచేసేవాడు. అదే స్కూల్‌కు చెందిన ఒక మైనర్ బాలికకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తానంటూ నమ్మబలికి గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియానికి తీసుకువెళ్లాడు. అక్కడ ట్రైనింగ్ సాకుతో బాలిక పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది. వారు వెంటనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు సురేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బాలికకు రూ.50 వేలు సాయం
దాదాపు తొమ్మిదేళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణలో భాగంగా, ప్రాసిక్యూషన్ తరపున పీపీ (Public Prosecutor) ప్రభాకర్ రెడ్డి విజయవంతమయ్యారు. కేసుకు సంబంధించి పక్కా ఆధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి వెంకటేష్, నిందితుడిపై పోక్సో చట్టం కింద పెట్టిన కేసును సమర్థించారు. సురేష్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు రూ.200 నగదు జరిమానా కూడా విధించారు. ఇక, బాధిత మైనర్‌కు 50 వేల రూపాయల నష్టపరిహారం అందించాలంటూ కోర్టు ఆదేశించింది. కాగా, చిన్నారులపై జరిగే అకృత్యాలు, అసభ్యకర ఘటనల విషయంలో చట్టాలు, న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువు అయ్యింది. కాగా, స్కూళ్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని అధికారులు, చట్ట నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Read Also- G Ram G Bill: పంతం నెరవేర్చుకున్న కేంద్రం.. లోక్‌సభలో జీ రామ్ జీ బిల్లుకు ఆమోదం

