BCCI Cash Reward: మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపింది. మహిళల విభాగంలో తొలిసారి ట్రోఫీని అందించి.. యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఆదివారం రాత్రి డి.వై. పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్ లో 52 పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ సేన విజయం సాధించింది. గతంలో రెండుసార్లు కప్ ను చేజార్చుకున్న ఉమెన్స్ జట్టు.. మూడోసారి మాత్రం పట్టుదలగా ఆడి వన్డేల్లో తొలి ఐసీసీ ట్రోఫీని అందించింది. తద్వారా యావత్ దేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేసింది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ టీమ్ కు బీసీసీఐ (BCCI) భారీ నజరానా ప్రకటించింది.
క్యాష్ ప్రైజ్ ఎంతంటే?
ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ కార్యదర్శి (BCCI Secretary) దేవజిత్ సైకియా (Devajit Saikia) రూ.51 కోట్ల పైజ్ మనీని ప్రకటించారు. ఈ బహుమతి జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ విజయం భారత మహిళా క్రికెట్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) మాట్లాడుతూ ఉమెన్స్ జట్టు విజయాన్ని 1983లో భారత పురుషుల జట్టు సాధించిన కప్ తో పోల్చారు. ‘ఇది భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ రోజు. 1983లో పురుషుల జట్టు సాధించిన మహత్తర విజయాన్ని నేడు మహిళలు ముంబయిలో పునరావృతం చేశారు. ఈ చారిత్రాత్మక విజయం దేశంలో మహిళా క్రికెట్‌కు అపారమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక నుంచి మన ఆట మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నాకెంతో నమ్మకం ఉంది’ అని ధుమాల్ అభిప్రాయపడ్డారు.
మ్యాచ్ ఎలా సాగిందంటే?
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత మహిళ జట్టు నిర్ణిత 50 ఓవర్లకు 298/7 స్కోరు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో షెఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మందనా (45), రిచా ఘోష్ (34) రాణించారు. మందనా – షెఫాలి జోడి తొలికి వికెట్ కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఓ దశలో భారత్.. 300పైగా పరుగులు చేస్తుందని అంతా భావించగా చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో 298 స్కోరు మాత్రమే చేయగలింది.
Also Read: Chevella Bus Accident Live Updates: ఘోర బస్సు ప్రమాదం.. ఎక్స్ గ్రేషియో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
దీప్తి శర్మ అద్భుత బౌలింగ్..
299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమమే లభించింది. టజ్మిన్ బ్రిట్స్, కెప్టెన్ లౌరా వోర్వార్ట్ లు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అమంజోత్ కౌర్ వేసిన మెస్మరైజింగ్ బాల్ కు బ్రిట్స్ ఔటై వెనుదిరగడంతో ఆటపై భారత్ పట్టు సాధించింది. అటు యువ స్పిన్నర్ శ్రీ చరణి తొలి ఓవర్ లోనే ఆన్‌నెక్ బోష్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేయగా.. షెఫాలి వర్మ బంతితోనూ మెరిసి సునే లూస్, మారిజానే కాప్‌లను త్వరత్వరగా ఔట్ చేసింది. దీప్తి శర్మ తన అద్భుత ప్రదర్శన (5/39)తో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. దీంతో 45.3 ఓవర్లలో 246 పరుగులు మాత్రమే చేసి దక్షిణాఫ్రికా ఆలౌట్ గా వెనుదిరిగింది. లౌరా వోల్వార్డ్ శతకంతో రాణించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
