Chevella Bus Accident Live Updates: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సును కంకర లారీ ఢీకొట్టిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి, సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. బాధితుతుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కర్నూలు బస్సు ప్రమాదాన్ని మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. మరోవైపు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.
టిప్పర్ డ్రైవర్‌ది మహారాష్ట్ర: మంత్రి
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి దామోదర రాజనర్సింహా పరామర్శించారు. ప్రమాదంలో గాయాలైన 19 మందికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. వారిలో 14 మందికి పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంలో కర్ణాటకు చెందిన మహిళ ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు చేవెళ్ల ఆస్పత్రి వద్దకు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
రాష్ట్రపతి దిగ్భ్రాంతి
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.
మృతుల వివరాలు..
చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి.. మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు.
❄️ దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
❄️ కల్పన (45), బోరబండ
❄️ ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
❄️ మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
❄️ బచ్చన్ నాగమణి (55), భానూరు
❄️ తారిబాయ్ (45), దన్నారమ్ తండా
❄️ గుర్రాల అభిత (21), యాలాల్
❄️ షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
❄️ తబస్సుమ్ జహాన్, తాండూరు
❄️ గోగుల గుణమ్మ, బోరబండ
❄️ తనూష
❄️ సాయి ప్రియ
❄️ నందిని
క్షతగాత్రుల వివరాలు
బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను సైతం అధికారులు ప్రకటించారు. వెంకటయ్య, బుచ్చిబాబు (దన్నారమ్ తండా), అబ్దుల్ రజాక్ (హైదరాబాద్), వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను (తాండూరు), నందిని (తాండూరు) బస్వరాజ్-కోకట్ (కర్ణాటక) ప్రేరణ (వికారాబాద్), సాయి, అక్రమ్ (తాండూరు) అస్లామ్ (తాండూరు) ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎక్స్ గ్రేషియో ప్రకటన
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు అందించనున్నట్లు వెల్లడించింది. అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. బస్సు ప్రమాదంలో ఇప్పటివరకూ 19 మంది చనిపోయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధ్రువీకరించారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు స్పష్టం చేశారు. మరణవార్తను మృతుల కుటుంబాలకు చేరవేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని చెప్పారు. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు చేవెళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పొన్నం పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యాధికారులను ఆరా తీశారు. అనంతరం బాధితుల బాగుగోలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి కూడా బాధితులను పరామర్శించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
తెలంగాణలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ను పీఎం సహాయ నిధి నుంచి అందించనున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన
చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను తనకు తెలియజేయాలని సూచించారు. మరోవైపు అందుబాటులోని మంత్రులు సైతం హుటాహుటీనా ఘటన స్థలికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధితులను హైదరాబాద్ కు తరలించి నాణ్యమైన వైద్య చికిత్స అందిచేలా ఏర్పాట్లు చేయాలని డీజీపీకి సీఎం సూచించారు. మరోవైపు ప్రమాదంలో గాయపడ్డ వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని.. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
చంద్రబాబు, పవన్ సంతాపం
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (CM chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.’ అని ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ సైతం ఘటనపై సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎక్స్ లో పవన్ పోస్ట్ పెట్టారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. మృతులకు అశ్రు నివాళులు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2025
చేవెళ్ళ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం
తెలంగాణ రాష్ట్రం చేవెళ్ళ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో… ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 3, 2025
హైల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు
చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రమాద వివరాలు, అధికారుల ఇచ్చిన సమాచారాన్ని ఈ కంట్రోల్ రూమ్ సమన్వయం చేయనుంది. మరోవైపు బాధితుల కుటుంబాలు.. సమాచారం కోసం 9912919545, 9440854433 నంబర్లకు సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, ఆర్టీసీ ఎండీ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బస్సు ప్రమాద ఘటన సహాయక చర్యలపై ఆరా తీశారు.
