Bathukamma festival 2025: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాలను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, జీహెచ్ఎంసీ, సెర్ఫ్ ల సంయుక్తాధ్వర్యంలో ఈ సారి బతుకమ్మ ఉత్సవాలను (Bathukamma festival 2025) ప్లాస్టిక్ పూలతో కాకుండా రియల్ ఫ్లవర్స్ తో నిర్వహించాలని జీహెచ్ఎంసీ (GHMC) నిర్ణయించింది. బోనాల ఉత్సవాల ఔన్నత్యాన్ని, సంస్కృతీ సంప్రదాలను మరింత గొప్పగా తెలియజేసేందుకు వీలుగా ఈ సారి కూడా సిటీలోని బిజీ జంక్షన్లలో మొత్తం 150 బతుకమ్మ ఐడల్స్ ను పెట్టాలని నిర్ణయించారు. కానీ గతంలో మాధిరిగా ప్లాస్టిక్ పువ్వులతో కాకుండా నిజమైన రకరకాల పువ్వులతో ఈ 150 బతుకమ్మలను పేర్చి, ప్రతి మూడు రోజులకోసారి ఆ పూలను మార్చాలని అధికారులు నిర్ణయించారు.
Also Read: Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో కొత్తగా 24,818 రేషన్ కార్డుల మంజూరు : భట్టి విక్రమార్క
గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలోని అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుకునే మహిళలు, స్వయం సహాయక బృందాల సభ్యులు తమ బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఈ సారి కూడా జీహెచ్ఎంసీ 74 కృత్రిమ కొలనులను సిద్దం చేసింది. ఇటీవల గణేశ్ నిమజ్జనాలు జరిగిన ఈ కృత్రిమ పాండ్లను విగ్రహాల వ్యర్థాలను తొలగించి, బతుకమ్మ నిమజ్జనానికి నీరు నింపి సిద్దం చేసే పనిలో జీహెచ్ఎంసీ నిమగ్నమై ఉంది. జీహెచ్ఎంసీలోని ప్రతి సర్కిల్ లో బతుకమ్మ పోటీలను నిర్వహించి, సర్కిళ్ల వారీగా ఇద్దరు విజేతలను ఎంపిక చేసి, ఈ నెల 30న జరిగే ట్యాంక్ బండ్ వద్ద జరిగే బతుకమ్మ తుది పోటీలకు పంపాలని ఇప్పటికే అధికారులు అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. దీనికి తోడు గన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కైవసం చేసుకోవటమే లక్ష్యంగా గతంలో 2016లో సుమారు ఎనిమిది వేల మంది స్వయం సహాయక బృందాల సభ్యులతో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించినా, వర్షం కారణంగా ఆ ప్రయత్నం విఫలం కావటంతో ఈ సారి ఎలాగైనా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును కైవసం చేసుకునే దిశగా జీహెచ్ఎంసీ ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో మరోసారి బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు సిద్దమవుతుంది.
మొత్తం 10 వేల మందితో బతుకుమ్మ ఉత్సవాలు
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు (Guinness Book Records)ను కైవసం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ (GHMC) ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం పది వేల మందితో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడులను నిర్వహించనున్నారు. ఇందులో ఎనిమది వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను తరలించే బాధ్యతను బల్దియా తీసుకుంది. ఇందుకు గాను మధ్యాహ్నాం నాలుగు గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో 8 వేల మందిని సభ్యులను తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి తోడు మిగిలిన మరో 2 వేల మందిని సర్ఫ్ విభాగం తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో పాటు నెల 30వ తేదీన సచివాలయం ముందున్న అమరవీరుల జ్యోతి నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు స్వయం సహాయక బృందాలకు చెందిన 2 వేల మందితో స్పెషల్ గా బతుకమ్మ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేగాక, తెలంగాణ రుచులను అందుబాటులో ఉంచేందుకు ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇందులో రకరకాల ఫుడ్స్ డిష్ లను అందుబాటులో ఉంచేందుకు దాదాపు 50 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో హ్యాండీ క్రాఫ్ట్స్ ను కూడా ప్రదర్శనకు ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా…
ప్రకృతిని పూజించే అరుదైన పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు వీలుగా సర్కారు అన్ని విభాగాలను సమన్వయం చేసి, భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే ఉత్సవాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 30వ తేదీన సచివాలయం ముందున్న అమరవీరుల జ్యోతి నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు స్వయం సహాయక బృందాలకు చెందిన 2 వేల మందితో స్పెషల్ గా బతుకమ్మ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పరేడ్ నిర్వహిస్తున్న మహిళలపై పూల వర్షం కురిపించేందుకు కూడా రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. అంతటితో ఆగని ఈ శాఖ బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచం నలుమూలల తెలియజేసేందుకు వీలుగా ఈ సారి ఫస్ట్ టైమ్ విదేశీ టూరిస్టులను కూడా ఈ బతుకమ్మ పరేడ్ కు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.