Bathukamma Festival: తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 25 మళ్లీ ఊపరిపోసుకుని, నేను బతికే ఉన్నానని నిరూపించుకున్న బతుకమ్మ కుంటలో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఈ నెల 25వ తేదీన బతుకమ్మ ఉత్సవాలకు మరోసారి అంబర్ పేటలోని బతుకమ్మ కుంట వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే రోజు పండగ వాతావరణంలో బతుకమ్మకుంటను నగర ప్రజలకు ముఖ్యమంత్రి అంకితం చేయనున్నారు.
బతుకమ్మ కుంట వద్ద ఈ ఉత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, జలమండలి ఎండీ కె. అశోక్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొని అక్కడి ఏర్పాట్లను వివరించారు. జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంటకు గుర్తింపు వచ్చేలా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు జరగాలని సమీక్ష సమావేశంలో వేంనరేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. బతుకమ్మ కుంట చుట్టూ రాబోతున్న ఆకర్షణలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: Kerala Crime: బాలుడిపై 14 మంది అత్యాచారం.. నిందితుల్లో పొలిటిషియన్, ప్రభుత్వ ఉద్యోగులు
హైడ్రా కృషి అభినందనీయం
ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయి, కళావిహీనంగా ఉన్న బతుకుమ్మ కుంటను పునరుజ్జీవం పోసి, కబ్జాల చెర నుంచి విముక్తి కల్గించి, సర్వాంగ సుందరంగా బతుకమ్మ కుంటగా తీర్చడంలో హైడ్రా కృషి అభినందనీయమని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. కబ్జాల చెర నుంచి విముక్తి చేయడానికి రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ, కోర్టుకు వాస్తవాలు వివరించి బతుకమ్మ కుంటకు జీవం పోసిన ఘనత హైడ్రాదే అని కొనియాడారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇది ఒక యజ్ఞంలా చేశారంటూ అభినందించారు. బతుకమ్మ కుంట ఆక్రమణలను తొలగించి, చెరువుగా అభివృద్ధి చేయాలని తాము కోరగానే ముఖ్యమంత్రి ఈ పనిని హైడ్రాకు అప్పగించారని వారు వివరించారు.
రావాలి.. బతుకమ్మ ఆడాలి: మేయర్
బతుకమ్మ కుంట పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయని, ఈ నెల 25న కుంట వద్ద నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు అందరూ రావాలి, బతుకమ్మ ఆడాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, వి హనుమంతరావు నగరవాసులను కోరారు. నగరంలో మొదటి విడతా చేపట్టిన ఆరు చెరువులలో బతుకమ్మకుంట ఫస్ట్ ఉత్సవాలకు సిద్ధం కావటం ఎంతో ఆనందంగా ఉందని హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఉత్సవాలకు కూడా ముఖ్యమంత్రి వస్తానని చెప్పడం, ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీలకతీతంగా అందరూ వచ్చి, నగరంలో మరిన్ని చెరువుల అభివృద్ధికి ప్రోత్సహకంగా ఈ ఉత్సవాలను విజయవంతం చయాలని కోరారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చగా మారిన బతుకమ్మ కుంట అభివృద్ధి, ఉత్సవాలతో మరోసారి హైదరాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగాలని వారు కోరారు.
Also Read: Jupally Krishna Rao: ఈ సారి అంగరంగ వైభవంగా.. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు