GHMC: కమిషనర్ ఆదేశాలు బేఖాతరు
పారిశుద్ధ్యంపై డిప్యూటీ కమిషనర్లు అలసత్వం
క్షేత్రస్థాయిలో విధులకు హాజరుకాని వైనం
ముందుకు సాగని పారిశుద్ధ్య పనులు
రాంకీకి అప్పగించిన పనులు చేయాలని సిబ్బందిపై ఒత్తిడి
పలు సర్కిళ్లలో పర్మినెంట్ ఉద్యోగులకు జరిమానాలు
జరిమానాలు నేరుగా జీతాల నుంచి కట్
త్వరలో కార్మిక శాఖకు ఫిర్యాదు చేయనున్న ఉద్యోగులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదు. ముఖ్యంగా ఇప్పటివరకు కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ నిర్వహించిన ప్రతి సమీక్షా సమావేశంతో పాటు టెలీకాన్ఫరెన్స్‌లలో శానిటేషన్‌కే తాను ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్లు పునరుద్ఘాటిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగుపడాలంటూ అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏ మాత్రం అమలు కావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు మరింత మెరుగుగా నిర్వహించేందుకు వీలుగా డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉదయం ఐదున్నర గంటల కల్లా ఫీల్డు లెవెల్‌లో విధులు నిర్వర్తించాలని ఆదేశించినా, ఒక్క డిప్యూటీ కమిషనర్ గానీ, మెడికల్ ఆఫీసర్లు గానీ ఉదయం ఫీల్డు లెవెల్ డ్యూటీల్లో కనిపించడంలేదన్న ఆరోపణలున్నాయి.
పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే బాధ్యతను పూర్తిగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ), శానిటరీ జవాన్లకు అప్పగించి, వారు తీరికగా, ఎనిమిది, తొమ్మిది గంటల కల్లా విధులకు హాజరవుతున్నట్లు తెలిసింది. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యతలను స్వీకరించిన రాంకీ సంస్థ చేయాల్సిన పనులను కూడా దాదాపు అన్ని సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లు పర్మినెంట్ ఉద్యోగులే చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పారిశద్ద్య పనుల్లో భాగంగా రాంకీ జీహెచ్ఎంసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు, ఎంగేజ్ చేయాల్సిన వాహానాలను కూడా చేయటం లేదన్న ఆరోపణలున్నాయి.
ఒప్పందం ప్రకారం రాంకీ పని చేస్తుందా?
పారిశుద్ధ్య పనులకు సంబంధించి జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాంకీ పని చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించటంలో సర్కిల్, ప్రధాన కార్యాలయం స్థాయి అధికారులు విఫలమవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా రాంకీ అగ్రిమెంట్ కు విరుద్దంగా వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సిటీలోని మొత్తం 30 సర్కిళ్లలో చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించేందుకు రాంకీ మొత్తం 340 వాహానాలను సమకూర్చాల్సి ఉండగా, కేవలం 270 వాహానాలను ఎంగేజ్ చేసినట్లు సమాచారం. రాంకీ సేకరించాల్సిన చెత్త కుప్పలను సకాలంలో తరలించనందుకు డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు శానిటేషన్ విభాగంలోని పర్మినెంట్ ఉద్యోగులైన శానిటరీ జవాన్లను బాధ్యులను చేస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు బాధిత ఉద్యోగులు వాపోతున్నారు.
గత నెల జీతాల చెల్లింపులో భాగంగా ఒక్కో సర్కిల్ దాదాపు పది మంది పర్మినెంట్ ఉద్యోగుల జీతాల నుంచి ఒక్కోక్కరికి రూ. వెయ్యి జరిమానా విధించి, కట్ చేసినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. తమకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా రాంకీ సంస్థ వాహానాలను పంపకపోయినా, తమనే బాధ్యులను చేస్తూ జరిమానాలను విధించటాన్ని పర్మినెంట్ ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే కార్మిక శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని కొందరు బాధిత ఉద్యోగులు సిద్దమైనట్లు సమాచారం.
Read Also- Weather Update: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు
ఇందుకోసమే సిబ్బందిపై ఒత్తిడి
జీహెచ్ఎంసీతో రాంకీ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్త సేకరణ, తరలింపు పనులు చేసేందుకు వీలుగా రాంకీ పూర్తి స్థాయిలో సిబ్బంది, వాహనాలను వినియోగించకుండా జీహెచ్ఎంసీ మ్యాన్‌పవర్, వెహికల్స్‌తో పనులు చేపట్టేందుకు వీలుగా డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లకు నెలసరి ఇన్సెంటీవ్ లు చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఇన్సెంటీవ్‌ల కోసమే డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బందితో రాంకీ చేయాల్సిన పనులు చేసేలా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాంకీకి జీహెచ్ఎంసీ బకాయి పడ్డ మొత్తం బకాయిల్లో ఇటీవలే రూ. వంద కోట్లను చెల్లిస్తూ కమిషనర్ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. రాంకీకి పైసలు చెల్లించాం, సరిగ్గా పని చేసేలా పర్యవేక్షించాలని, చెత్త సేకరణ, తరలింపులో ఏ మాత్రం జాప్యం జరిగినా రాంకీకి జరిమానాలు విధించాలని కమిషనర్ ఆదేశిస్తూ, ఆ ఆదేశాలను రాంకీ అమలు చేయాల్సిన డిప్యూటీ కమిషనర్లు మెడికల్ ఆఫీసర్లు కింది స్థాయి ఉద్యోగులపై అమలు చేస్తూ, వారికి జరిమానాలు విధించి, వారికి తెలియకుండానే జీతాల నుంచి కట్ చేస్తూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
