Chhattisgarh Train Accident: ఇటీవల దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. రైలు ప్రయాణాలు చేయడం మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ట్రైన్ జర్నీ కూడా అంత సురక్షితం కాదనే భావన కలిగే షాకింగ్ ఘటన మంగళవారం జరిగింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో రెండు రైళ్లు (Chhattisgarh Train Accident) ఢీకొన్నాయి. ఒక ప్యాసింజర్ రైలు వేగంగా వెళ్లి ఒక గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై బిలాస్‌పూర్ జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ స్పందించారు. ఈ ప్రమాదంంలో మరణాలు నమోదైన విషయం నిజమేనని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్యాసింజర్ టైన్ కోర్బా నుంచి బిలాస్‌పూర్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.
ఈ ఘోర ప్రమాదం రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోని దృశ్యాలను చూస్తే, కోర్బా ప్యాసింజర్ ట్రైన్ మొదటి బోగీ గూడ్స్ రైలుపైకి ఎక్కింది. దీనిని బట్టి ప్రమాద తీవ్ర ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. రెస్యూ టీమ్‌లు ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరాయి.
Read Also- Health Tips: పండ్లు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన ఆరోగ్య నిపుణులు
ప్రమాద తీవ్రత ఎక్కువే
ఈ రైలు ప్రమాదం బిలాస్‌పూర్ – కట్ని సెక్షన్‌లో జరిగింది. లాల్ ఖడాన్ ప్రాంతంలో నిలిచి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్ర ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని బోగీలైతే ఏకంగా ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. చాలా బోగీలు పట్టాలు తప్పాయి. అంతేకాదు, ఓవర్‌హెడ్ వైర్లు, సిగ్నలింగ్ వ్యవస్థకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఘటనా స్థలానికి సంబంధించిన కొన్ని వీడియోలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో, ఆ రూట్‌లో రైల్వే కార్యకలాపాలు నిలిచిపోయాయి.
రైల్వే సహాయక బృందాలు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స అందించడానికి అత్యవసర వైద్య బృందాలను రంగంలోకి దించారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి పలువురు రైల్వే సీనియర్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రయాణీకులు, వారి బంధువులు సమాచారం కోసం చంపా జంక్షన్ – 808595652, రాయ్‌గఢ్ – 975248560, పెండ్రా రోడ్ – 8294730162 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచన చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also- The RajaSaab: ‘రాజాసాబ్’పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అది మాత్రం పక్కా..
