Instagram CEO: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విషయం యూజర్లకు అర్థం కానీ పజిల్ లా అనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్, ఇంటి సభ్యులతో చర్చించుకున్న విషయాలు, ప్రొడక్ట్స్.. వెంటనే యాడ్స్ రూపంలో వారి కంటపడుతుంటాయి. దీంతో ఇన్ స్టాగ్రామ్ ఏమైనా రహస్యంగా తమ మాటలు వింటోందా? అన్న అనుమానాలు చాలా మందిలో మెదులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఇన్ స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోసేరి స్పందించారు. యూజర్లు చర్చించుకున్న విషయాలు.. ప్రకటనల రూపంలో కనిపించడం వెనకున్న రహస్యాన్ని అదరికి తెలియజేశారు.
‘అలా చేస్తే.. ఈజీగా కనిపెట్టొచ్చు’
ఇన్ స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోసెరి మాట్లాడుతూ మైక్రో ఫోన్ ద్వారా యూజర్లు మాటలను తాము వినడం లేదని తేల్చిచెప్పారు. మైక్రోఫోన్ ద్వారా సంభాషణలు విని ప్రకటనల కోసం డేటా సేకరిస్తున్నామన్న వదంతులను ఖండించారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి చర్యలు వ్యక్తిగత గోప్యతకు తీవ్రంగా భంగం కలిగిస్తాయని అన్నారు. ఒక వేళ నిజంగానే మైక్రోఫోన్ ద్వారా యూజర్ల సంభాషణ వింటే.. అది వెంటనే బయటపడిపోతుందని ఆడమ్ అన్నారు. మెుబైల్ లో మైక్రోఫోన్ సూచిక వెలుగుతుండటం, బ్యాటరీ వేగంగా ఖాళీ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని స్పష్టం చేశారు.
‘నా భార్యకు ఈ అనుమానమే వచ్చింది’
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ లో వచ్చే ప్రకటనలు.. యూజర్ల సంభాషణలకు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా ఉంటుండటంతో ఈ వదంతులు కొన్నేళ్లుగా ప్రచారం అవుతున్నాయి. అయితే తన భార్యకు కూడా ఇలాంటి అనుమానమే వచ్చిందని ఆడమ్ తెలియజేశాడు. 2016 నుంచే ఈ ఆరోపణలను తాము ఖండిస్తూ వస్తున్నామని చెప్పారు. మైక్రోఫోన్ డేటాను ప్రకటనల కోసం వాడటం లేదని ఆ ఏడాదే కంపెనీ స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.. అమెరికా కాంగ్రెస్‌లో ఇచ్చిన వివరణలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని గుర్తు చేశారు.
ప్రకటనల వెనక అసలు సీక్రెట్ ఇదే
అయితే సంభాషణకు తగ్గట్లు ప్రకటనలు రావడానికి గల కారణాలను ఇన్ స్టాగ్రామ్ అధిపతి తెలియజేశారు. ఆడమ్ మోసెరి ప్రకారం.. యాడ్స్ విషయంలో ఇన్ స్టాగ్రామ్ అధునాతన సాంకేతికతను వినియోగిస్తోంది. యూజర్లు ఏ ఏ వెబ్ సైట్స్ ను సందర్శించారో ఆ డేటాను వెబ్ సైట్లు మెటాతో పంచుకుంటాయి. ఆ డేటాతో మెటా వినియోగదారుల ప్రొఫైల్ ను తయారు చేస్తుంది. అలా వారు సెర్చ్ చేసిన ప్రొడక్ట్స్, ట్రావెల్ తదితర విశేషాలను యాడ్స్ రూపంలో అందించడం జరుగుతోందని వివరించారు. కాగా, ఈ విధానం మెటాకు ప్రకటనల రూపంలో భారీ ఆదాయాన్ని తీసుకొచ్చింది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా ప్రకటనలు చూపించి.. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ద్వారా మాతృ సంస్థ మెటా బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది.
Also Read: Putin on PM Modi: మోదీతో పెట్టుకోవద్దు.. భారత్ ఎప్పటికీ తలవంచదు.. ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్
డిసెంబర్ నుంచి కొత్త విధానం
మైక్రోఫోన్ వాడకంపై వదంతులను ఖండిస్తూనే మెటా మరింత వ్యక్తిగత డేటాను సేకరించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 16 నుండి అమల్లోకి వచ్చే కొత్త గోప్యతా విధానం ప్రకారం.. మెటా తన ఏఐ ఉత్పత్తులతో (ఉదాహరణకు మెటా ఏఐ చాట్‌బాట్స్) వినియోగదారుల ఇంటరాక్షన్‌లను సేకరించనుంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ప్రకటనల టార్గెటింగ్ కోసం ఉపయోగించుకోనుంది. ఏఐ అసిస్టెంట్లతో చాటింగ్ చేసే సమయంలో వినియోగదారులు తమ వ్యక్తిగత ఆసక్తులు, ఆలోచనలు, కార్యకలాపాలను ఎక్కువగా పంచుకుంటారు. ఈ డేటా ఇప్పుడు మెటా ప్రకటనల వ్యవస్థలోకి వెళ్లనుంది. అయితే మతం, ఆరోగ్యం, లైంగిక ప్రవృత్తి వంటి సున్నితమైన అంశాలను మాత్రం మినహాయిస్తామని కంపెనీ చెబుతోంది.
