IndiGo: దేశవ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఊరట కల్పించింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో జరిగిన ఆపరేషనల్ అంతరాయాలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు మొత్తం రూ.500 కోట్లకు పైగా పరిహారం చెల్లించనున్నట్లు ఇండిగో శుక్రవారం ప్రకటించింది.
24 గంటల లోపు విమానాలు రద్దు కావడం, అలాగే కొన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు పూర్తిగా చిక్కుకుపోవడం వంటి పరిస్థితులు ఎదురైన వారికి ఈ పరిహారం వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, రీఫండ్ ప్రక్రియతో పాటు పరిహారం చెల్లింపులపై సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ఇండిగో తెలిపింది.
Also Read: Teachers Protest: పంచాయతీ రాజ్‌పై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. అతి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంపై ఫైర్!
డిసెంబర్ 2025 వరకు ప్రభావితమైన ప్రయాణికులందరికీ రీఫండ్‌లను వేగంగా, అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఇండిగో పేర్కొంది. ఇప్పటికే ఎక్కువ భాగం రీఫండ్‌లు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే ఖాతాల్లోకి చేరుతాయని సంస్థ వెల్లడించింది.
అదేవిధంగా, డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ఇబ్బంది పడి విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికుల వివరాలను ప్రస్తుతం గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రయాణికులందరినీ జనవరిలో నేరుగా సంప్రదించి, పరిహారం చెల్లింపును సులభంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేస్తామని ఇండిగో హామీ ఇచ్చింది.
“ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సులభంగా ఉండేలా చూస్తున్నాం. ప్రస్తుత అంచనాల ప్రకారం, ప్రభావితమైన ప్రయాణికులకు చెల్లించే మొత్తం పరిహారం రూ.500 కోట్లను మించనుంది,” అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఈ ఆపరేషనల్ అంతరాయాలకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్ల్సన్ నేతృత్వంలోని Chief Aviation Advisors LLC సంస్థను నియమించింది. ఈ స్వతంత్ర నిపుణుల బృందం సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, మూల కారణాలపై విశ్లేషణ చేసి నివేదికను ఇండిగో బోర్డుకు సమర్పించనుంది.
ఇండిగో బోర్డు ఏర్పాటు చేసిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (CMG) సూచనల మేరకే ఈ స్వతంత్ర విచారణకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇండిగో స్పష్టం చేసింది.

