Teachers Protest: రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చే రెమ్యునరేషన్‌పై చిచ్చు మొదలైంది. ఉపాధ్యాయుల వర్గాలు ఈ అంశంపై భగ్గుమంటున్నాయి. అతి తక్కువగా ఇస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 10 రోజుల కష్టానికి కనిష్టంగా రూ.2,000 నుంచి గరిష్టంగా రూ.3,500 మాత్రమే ఇస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి 10 రోజుల పాటు(8 రోజుల పోలింగ్+ 2 రోజుల శిక్షణ) విధులు నిర్వహించిన వేలాది మంది ఉపాధ్యాయులు, అధికారులకు స్వల్ప మొత్తంలో రెమ్యునరేషన్ నిర్ణయించి పంచాయతీరాజ్ శాఖ తీవ్రమైన అవమానానికి గురి చేసిందని చెబుతున్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా పని చేసిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన రేట్ల ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా భిక్ష వేసినట్లు రోజుకు రూ.200 కంటే తక్కువగా నిర్ణయించడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ రాజ్‌పై ఆగ్రహం
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ), రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పంచాయతీరాజ్ శాఖ తుంగలో తొక్కిందని విమర్శలు వస్తున్నాయి. స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారికి 10 రోజులకు కేవలం రూ.2,000, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి రూ.2,200, స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారికి రూ.3,500 మాత్రమే ఇస్తున్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి రోజుకు సాధారణ టీఏ, డీఏ, మూడో వంతు అదనపు డీఏ చెల్లించాలని ఆదేశించినా ఆ మార్గదర్శకాలను కూడా ముఖ్య కార్యదర్శి ఇటీవల ఇచ్చిన మెమో ద్వారా తుంగలో తొక్కారని, ఉపాధ్యాయులను ఘోరంగా అవమానించారని విమర్శలు వస్తున్నాయి. స్టేజీ 1, 2 రిటర్నింగ్ అధికారుల మధ్య కూడా తీవ్రమైన వ్యత్యాసం ఉన్నదని, ఫలితంగా పూర్తయిన మొదటి విడుత ఎన్నికల్లో పలు గ్రామ పంచాయతీల్లో ఉపాధ్యాయులు ఈ రెమ్యునరేషన్‌ను తిరస్కరించినట్లు యూటీఎఫ్ విమర్శలు చేస్తున్నది. కొన్ని జిల్లాల్లో ఆ రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని, దాంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు.
Also Read: MCPI leaders: వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్.. ఎక్కడంటే?
మెమోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
తెలంగాణలో మరో రెండు విడుతల పోలింగ్ జరగాల్సి ఉన్నది. ఈ నెల 14, 17 తేదీల్లో ఇవి ఉండనున్నాయి. ఈ రెండు దశల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే పంచాయతీ రాజ్ శాఖ ఇటీవల ఇచ్చిన మెమోను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీజీఎస్‌ఈసీ నిర్దేశించిన రేట్ల ప్రకారం పూర్తి టీఏ, డీఏ, మూడో వంతు అదనపు డీఏ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే విధులు పూర్తి చేసిన వారికి తేడా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్, టీఆర్‌టీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శికి, పంచాయతీరాజ్ డైరెక్టర్‌కు మెమోరాండం సైతం ఈ సంఘాలు సమర్పించినట్లు తెలిసింది.
మా డిమాండ్స్ ఇవే
పోలింగ్ తర్వాత హెడ్ క్వార్టర్స్‌కు చేరేందుకు బస్ సౌకర్యం కల్పించాలి. గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ పూర్తయి పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించే సరికి అర్ధరాత్రి అవుతున్నది. కాబట్టి ఎన్నికల మర్నాడు పోలింగ్ సిబ్బందికి ఆన్ డ్యూటీ వర్తింపజేయాలి. అలాగే పోలింగ్ అనంతరం సిబ్బంది హెడ్ క్వార్టర్స్ చేరేందుకు బస్సు సౌకర్యం కల్పించాలి. పోలింగ్ మెటీరియల్‌ను అప్పగించేసరికి రాత్రి ఆలస్యమవుతుండటంతో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సిబ్బందికి రెమ్యునరేషన్ పెంపుపై పంచాయతీరాజ్ ఆలోచన చేయాలి.
– తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్
Also Read: H-Citi works: 400 కోట్ల వ్యయంతో ఫిల్టర్ బెడ్ నుంచి ఫ్లై ఓవర్.. బల్దియా ఫోకస్..!

