H-Citi works: మెహిదీపట్నం నుంచి ఇతర జిల్లాలకు ముంబై నేషనల్ హైవేకి నానల్ నగర్ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు త్వరలోనే ట్రాఫికర్ నుంచి కాస్త ఊరట లభించనుంది. కోర్ సిటీ నుంచి ముంబై(Mumbai), కర్ణాటక(Karnataka)లోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే లక్షలాది వాహానాలతో నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కునే ఈ జంక్షన్ లో హెచ్ సిటీ పనుల కింద సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలన సిద్దం చేసింది. అర్థరాత్రి రెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు మినహా మిగిలిన సమయంలో పీవీఎన్ ఎక్స్ ప్రెస్(PVN Express way) వే కింద సరోజినీదేవి కంటి ఆస్పత్రి(Sarojini Devi Eye Hospital) మొదలుకుని రేతీబౌలీ జంక్షన్, నానల్ జంక్షన్ వరకు వేలాది వాహానాలు క్యూ కట్టి దర్శనిమిస్తుంటాయి. ఇక్కడి ట్రాఫిక్ లో కనీసం అంబులెన్స్ కూడా సరిగ్గా ప్రయాణించలేని పరిస్థితులకు శాశ్వత చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ నడుంబిగించింది. ప్రస్తుతం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ముందు నుంచి ఆరంఘర్ వరకున్న అతి పెద్ద ఎక్స్ ప్రెస్ వేకు సమానంగా మరో ఫ్లై ఓవర్ ను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ రూ. 400 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ శుక్రవారం నుంచి టెండర్లను కూడా ఆహ్వానించింది.
నానల్ నగర్ జంక్షన్ నుంచి
ముఖ్యంగా మెహిదీపట్నం బసంతర్ హౌజ్ లోని రక్షణ శాఖ స్థలంలోనున్న జలమండలి ఫిల్టర్ బెడ్ నుంచి పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వేకు సమాంతరంగా ఫ్లై ఓవర్ ను నిర్మిస్తూ రేతీబౌలీ జంక్షన్ లో అత్తాపూర్ వైపు ఓ ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రేతీబౌలీ సిగ్నల్ నుంచి నానల్ నగర్ జంక్షన్ మీదుగా ఈ ఫ్లై ఓవర్ ను టోలీచౌకీ ఫ్లై ఓవర్ కు కనెక్టివిటీగా నిర్మించనున్నారు. నానల్ నగర్ జంక్షన్ నుంచి ఎడమవైపు లంగర్ హౌజ్ వైపు వెళ్లే వాహానాలకు నానల్ నగర్ జంక్షన్ కు ఎడమ వైపున్న ఆలివ్ హాస్పిటల్ వరకు ఓ ర్యాంప్ ను ఏర్పాటు చేసే పనులకు టెండర్లను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. మరో పక్షం రోజుల్లో టెండర్లు ఖరారైన తర్వాత సర్కారు అనుమతితో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించే దిశగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఫ్లై ఓవర్ అటు టోలీ చౌకీ వైపు, అత్తాపూర్, లంగర్ హౌజ్ ల వైపు వాహానాలు వెళ్లేందుకు తిరిగి వచ్చేందుకు అనుకూలంగా ఉండేలా రెండు లేన్ల ఫ్లై ఓవర్ ను నిర్మించేందుకు ఏర్పాట్లు చరుకుగా సాగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఎన్ఎండీసీ జంక్షన్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం(Mehidipatnam) రైతుబజార్ బస్టాపు, రేతీబౌలీ, నానల్ నగర్, ఆలీవ్ హాస్పిటల్ సిగ్నల్ ప్రాంతాల్లో తరుచూ ఏర్పడే ట్రాఫిక్ జామ్ వంటి సమస్య చాలా వరకు తగ్గుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
Also Read: Sand Bazaars: ఇందిరమ్మ ఇళ్లకు టన్నుకు రూ.1200కే ఇసుక.. మంత్రి కీలక వ్యాఖ్యలు
రక్షణ శాఖ స్థల సేకరణకు కసరత్తు
మెహిదీపట్నంలోని రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఈ ఫ్లై ఓవర్ కోసం సేకరించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రహదారుల పంచాయతీకసి తెర దింపుతూ ఇటీవలే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల కోసం బోర్డుకు చెందిన సుమారు రూ. 420 కోట్ల స్థలాల సేకరణకు లైన్ క్లియర్ అయి, రక్షణ శాఖ నుంచి ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి వర్క్ పర్మిట్ కూడా ఇవ్వటం, సేకరించిన రూ. 420 కోట్ల స్థలానికి బదులుగా రక్ష శాఖకు ప్రత్యామ్నాయంగా జవహర్ నగర్ లో స్థలం కేటాయింపునకు సంబంధించి సర్కారు కూడా సానుకూలంగా ఉండటంతో మెహిదీపట్నం రక్షణ శాఖ స్థలాల సేకరణకు బల్దియా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా రక్షణ శాఖ, బల్దియా అధికారులు సమావేశమైనట్లు సమాచారం. కంటోన్మెంట్ స్థలాలకు ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించేందుకు సర్కారు సిద్దమైతే స్థలాలిచ్చేందుకు తాము సిద్దమేనని రక్షణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించేందుకు సర్కారు సానుకూలమైన నిర్ణయం తీసుకునేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశమున్నందున, అంతలోపు సమయం వృధా చేయకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.
రోడ్ నెం.12 నుంచి మరో ఫ్లై ఓవర్
బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం, శంషాబాద్ ఏయిర్ పోర్టు(Shamshabad Airport), ముంబై జాతీయ రహదారి, లంగర్ హౌజ్ వైపు వచ్చే వాహానాలు ప్రస్తుతం రోడ్ నెం 12 విరంచి హాస్పిటల్ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ జంక్ష్, ఎన్ఎండీసీ జంక్షన్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం రైతుబజార్, రేతీబౌలీ, నానల్ నగర్ ల మీదుగా, లేక ఏయిర్ పోర్టు వైపు వెళ్లే వాహానాలు సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ముందు నుంచి ఉన్న పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వే కారిడార్ మీదుగా ఏయిర్ పోర్టుకు ప్రయాణించాల్సి ఉంది. ఇందుకు గాను వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి అహ్మద్ నగర్ డివిజన్ లోని హోటల్ నషేమన్, పోచమ్మ బస్తీ మీదుగా హుమాయున్ మెయిన్ రోడ్డు, ఆ తర్వాత ఫిల్టర్ బెడ్ నుంచి నిర్మించనున్న ఫ్లై ఓవర్ కు అనుసంధానంగా మరో ఫ్లై ఓవర నిర్మాణానికి కూడా జీహెచ్ఎంసీ(GHMC) ప్రతిపాదనలను సిద్దం చేసింది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం స్థల సేకరణ దశలో ఉన్నట్లు సమాచారం.
Alsom Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం