KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవనుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ముందుకు తీసుకు పోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరగనున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గోదావరి కృష్ణ జలాలను కొల్లగొడుతున్నా కూడా, దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇటువంటి సందర్భంలో… తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావిస్తున్నట్టు బీఆర్ఎస్ పేర్కొంది.
ఇందులో భాగంగానే తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనున్నదని ప్రకటనలో పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని ప్రకటనలో బీఆర్ఎస్ పేర్కొంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ విమర్శిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని మండిపడ్డింది.
మరో ఉద్యమ యోచనలో కేసీఆర్!
తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నదని గులాబీ పార్టీ వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జల దోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రకటనలో బీఆర్ఎస్ పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడి ఉండేవని తెలిపింది.
Read Also- MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!
పూర్తి నిర్లక్ష్య వైఖరి
రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడంతో పూచిక పొల్లంత పని కూడా చేయలేదని, తద్వారా ఆ ప్రాంతం ప్రజలు రైతాంగము తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. రెండేళ్లు గడిచినా కూడా, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదని పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడం అనేది ఘోరాతిఘోరం, దుర్మార్గమని బీఆర్ఎస్ పేర్కొంది. కాబట్,టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదని స్పష్టం చేసింది. ఇటువంటి కీలక సమయంలో పైన పేర్కొన్న విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కూలంకష చర్చ జరగనున్నదని బీఆర్ఎస్ తెలిపింది. చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ., పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జల దోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నట్టు వివరించింది.

