Geethanjali 4K: తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), మణిరత్నం (Mani Rathnam) కాంబినేషన్‌లోని బ్లాక్‌బస్టర్ క్లాసిక్ ‘గీతాంజలి’ త్వరలోనే రీ-రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే నాగార్జున నటించిన మరో మైలురాయి చిత్రం ‘శివ’ రీ-రిలీజై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రీ రిలీజ్‌ల పరంపరలో ‘గీతాంజలి’ (Geethanjali 4K) వంటి ప్రేమకావ్యం కూడా థియేటర్లలోకి రావడం అభిమానులకు ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవాలి. 1989లో విడుదలైన ‘గీతాంజలి’ అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది. యువతరం ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. కింగ్ నాగార్జున, గిరిజ షట్టర్, విజయకుమార్ వంటి నటులు అద్భుతమైన నటనతో ఈ చిత్రాన్ని ఓ కల్ట్ క్లాసిక్‌గా నిలబెట్టారు. ఈ చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలతో పాటు, ఇళయరాజా (Ilaiyaraaja) అందించిన చిరస్మరణీయమైన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
రీ-రిలీజ్ హక్కులు ఎవరికంటే..
ఈ అద్భుతమైన చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పద్మినీ సినిమాస్ అధినేత బూర్లె శివప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. బాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి సి. పద్మజ నిర్మించిన ఈ చిత్రం యొక్క ప్రపంచవ్యాప్త (చెన్నై మినహా) రీ-రిలీజ్ హక్కులను శివప్రసాద్ గతంలోనే దక్కించుకున్నారు. రీ-రిలీజ్‌ను అత్యున్నత ప్రమాణాలతో అందించడానికి, ‘గీతాంజలి’ చిత్రాన్ని 4K డిజిటల్ ఫార్మాట్‌లో పునరుద్ధరించే కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. పాతతరం ప్రేక్షకులకు నాటి మధురానుభూతులను గుర్తు చేస్తూనే, ప్రస్తుత యువతరం ఈ క్లాసిక్ ప్రేమకథా చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడడానికి మేకర్స్ రెడీ చేస్తున్న 4K వెర్షన్ ఒక అద్భుతమైన అవకాశం కల్పించనుంది. ఇప్పటి తరాన్ని కూడా ఆకర్షించగల కంటెంట్ ఇందులో ఉండటంతో కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి, భారీగా కలెక్షన్స్ రాబడుతుందని నిర్మాత భావిస్తున్నారు.
Also Read- Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..
నాటి జ్ఞాపకాలు మరోసారి తెరపైకి
ఈ సందర్భంగా పద్మినీ సినిమాస్ అధినేత బూర్లె శివప్రసాద్ మాట్లాడుతూ.. ‘గీతాంజలి’ నా హృదయానికి ఎంతో నచ్చిన చిత్రం. అందుకే, ఈ క్లాసిక్ రీ-రిలీజ్ హక్కులను పొందడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నాగార్జున, మణిరత్నంల ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, ఆదరణ లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. త్వరలోనే ఈ అద్భుత చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తామని చెప్పారు. అక్కినేని అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ‘గీతాంజలి’ 4K రీ-రిలీజ్ తేదీని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ రీ-రిలీజ్ తో నాటి జ్ఞాపకాలు మరోసారి తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం.. ఈ సినిమా ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుంటో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

