Telangana Police: తెలంగాణలో నాలుగో సింహం దారి తప్పిందా?
Telangana Police ( image CREDIT: TWITTER OR FREE PIC)
Telangana News, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana Police: ఖాకీవనంలో కలుపు మొక్కలు.. టార్గెట్లు పెట్టుకుని మరీ నెలవారీ వసూళ్లు!

Telangana Police: తెలంగాణలో నాలుగో సింహం దారి తప్పుతోంది. పోలీసు శాఖలో కొంతమంది అధికారులు తమ ఖాకీ యూనిఫాంను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. టార్గెట్లు పెట్టుకుని మరీ నెలవారీ వసూళ్లు చేయడం, సివిల్ వివాదాల్లోనూ తలదూర్చి బలవంతపు సెటిల్మెంట్లు చేస్తూ అందినకాడికి నోట్ల కట్టలు వెనకేసుకుంటున్నారు. అక్రమార్కులకు సహకారం అందిస్తూ లక్షలు పోగేసుకుంటున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డా, అలసత్వం చూపించినా కఠిన చర్యలు తప్పవన్న పోలీస్​బాసుల హెచ్చరికలను కూడా కిందిస్థాయి సిబ్బందితో పాటు కొందరు పైస్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దొరికినప్పుడు దేఖ్​లేంగే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణం వారికి పొలిటికల్‌తో పాటు డిపార్ట్‌మెంట్‌లో గాడ్ ఫాదర్ల అండ ఉండటమేనని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.


టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు

ప్రజలకు పోలీస్​స్టేషన్లు ప్రథమ న్యాయస్థానాలు.. నిష్పాక్షకమైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం అందేలా చూడాలని డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శివధర్ రెడ్డి సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. అయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో కొంతమంది అధికారుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని 60 శాతానికి పైగా పోలీస్ స్టేషన్లకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మామూళ్లు ఉన్నట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇందులో ట్రాఫిక్ స్టేషన్లు కూడా ఉండటం గమనార్హం. కొందరు ఏసీపీలు తమ పరిధిలోని స్టేషన్ల సీఐలు, ఎస్ఐలపై ఒత్తిడి చేసి డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సివిల్ తగాదాలను తమ వద్దకే పంపించుకుని, సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద మొత్తంలో పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతోనే ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్‌లోని మహంకాళి ఏసీపీపై బదిలీ వేటు పడిందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Also Read: Telangana Police: గంజాయి రవాణాలో.. అక్రమార్కులు కట్టుదిట్టంగా వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారా?


రికవరీల్లోనూ చేతివాటం

కొందరు అధికారులు కేసుల్లో రికవరీ చేసే బంగారం, నగదులో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగలను పూర్తిగా బాధితులకు ఇవ్వకుండా, కొంత కొట్టేస్తున్నారనే ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఈస్ట్​జోన్​పరిధిలోని ఓ సీఐ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారంలో పాతిక శాతం అక్రమంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక, బెట్టింగుల్లో లక్షలకు లక్షలు పోగొట్టుకున్న అంబర్‌పేట ఎస్ఐ భాను ప్రకాశ్ ఏకంగా రికవరీ చేసిన బంగారాన్ని తెగనమ్ముకోవడమే కాకుండా, తన సర్వీస్ పిస్టల్‌ను కూడా అమ్మేసుకోవడం ఈ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఇటీవల సస్పెండ్​అయిన టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్​గౌడ్ ఉదంతం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఆర్థిక మోసగాడు ఉప్పలపాటి సతీష్‌తో రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకుని, అతనికి తప్పించుకునే అవకాశం కల్పించారనే ఆరోపణలపై శ్రీకాంత్‌ను సస్పెండ్ చేశారు. అయితే, ఇంత పెద్ద డీల్‌లో పై అధికారి ప్రమేయం లేకుండా ఉండదనే వాదనలు ఉన్నా, ఉన్నతాధికారులు అతడిని కనీసమాత్రంగా కూడా విచారించకపోవడం గమనార్హం.

ఇంకెన్నో..

మరోవైపు, ఏసీబీ వరంగల్​రేంజ్‌లో పని చేస్తున్న ఓ డీఎస్పీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఎమ్మార్వో స్నేహితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బెదిరించి కోటి రూపాయిలు డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో అడ్వాన్సుగా రూ.20 లక్షలు తీసుకున్నట్టు ఆడియో క్లిప్పింగులు కూడా వెలుగు చూశాయి. అయినప్పటికీ ఆ డీఎస్పీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అతడి బ్యాచ్‌మేట్ చక్రం తిప్పారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక, వరంగల్ ఏసీబీ అధికారులు అరెస్టయిన ఎమ్మార్వో కుటుంబంతో పరిచయం ఉన్న ఓ కానిస్టేబుల్ భార్యను కూడా అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టుగా తెలిసింది.

పోలీసు వర్గాల నుంచే తీవ్ర విమర్శలు

ఫిర్యాదు అందగా విచారణ జరిపిన ఏసీబీ ఉన్నతాధికారులు సదరు ఏసీబీ డీఎస్పీ బాధితుల్లో కొందరి నుంచి స్టేట్‌మెంట్లతోపాటు ఆడియో క్లిప్పింగులను తీసుకున్నారు. కానిస్టేబుల్ భార్య వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. అయితే, ఇప్పటివరకు సదరు ఏసీబీ డీఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం గమనార్హం. ఇలాంటి పరిణామాలపై పోలీసు వర్గాల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పై స్థాయి అధికారులకు పొలిటికల్ గాడ్​ఫాదర్ల అండ ఉండటం వల్లే కిందిస్థాయి సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకుని, పైవారిని ఉపేక్షిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: Telangana Police: గంజాయి రవాణాలో.. అక్రమార్కులు కట్టుదిట్టంగా వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారా?

Just In

01

Shocking Crime: దేశంలో ఘోరం.. భార్యను కసితీరా చంపి.. డెడ్ బాడీతో సెల్ఫీ దిగాడు

Bigg Boss Telugu 9: ఇమ్మాన్యూయేల్ వ్యవహారంపై ఫైర్ అయిన రీతూ.. డీమాన్ పవన్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..

Harish Rao: కాంగ్రెస్‌కు సంగారెడ్డి నేతలుగుడ్ బై.. కండువాలు కప్పి ఆహ్వానించిన హరీశ్!

Elon Musk: ఏఐ మాత్రమే మీడియాను ఓడిస్తుంది.. రియల్‌ టైమ్ కంటెంట్‌పై ఎలన్ మస్క్ సంచలన కామెంట్స్

BL Santhosh: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. పార్టీ నాయకులకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం!