Kingfisher – ED: చాలా కాలం నుంచి కొనసాగుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో ఈడీ కీలక అడుగు వేసింది. ఇప్పటికే మూసివేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వారి జీతాలు, బకాయిల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.300 కోట్లకు పైగా డబ్బును తిరిగి అందించింది.
ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం రూ.311.67 కోట్లను కింగ్‌ఫిషర్ మాజీ ఉద్యోగులకు పంపిణీ చేయడానికి అధికారిక లిక్విడేటర్‌కు బదిలీ చేయనున్నారు. ఈ డబ్బు చెన్నైలోని డెబ్ట్స్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) డిసెంబర్ 12న ఇచ్చిన ఆదేశాల మేరకు విడుదలైంది.
గతంలో ఈడీ మనీలాండరింగ్ కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, విజయ్ మాల్యా తదితరుల ఆస్తులను జప్తు చేసింది. ఆ ఆస్తుల్లో కొన్ని షేర్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇచ్చింది. ఇప్పుడు అదే డబ్బులో నుంచి ఉద్యోగుల బకాయిల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేశారు. విజయ్ మాల్యాపై బ్యాంకు రుణాల మోసం కేసులు ఉండగా, 2019లో ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో భాగంగా ఈడీ ఇప్పటికే రూ.14,132 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు తిరిగి అందించింది.
ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఈడీ స్వయంగా ముందుకొచ్చి ఎస్‌బీఐతో, ఇతర అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపింది. ఉద్యోగుల డబ్బుకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వడానికీ బ్యాంకు అంగీకరించడంతో ఈ చెల్లింపులు సాధ్యమయ్యాయని ఈడీ వెల్లడించింది. ఈ నిర్ణయంతో కింగ్‌ఫిషర్ మాజీ ఉద్యోగుల దీర్ఘకాల పోరాటానికి కొంతమేర న్యాయం జరిగినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: MP Jairam Ramesh: గాంధీ, నెహ్రూపై ద్వేషమే.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలం.. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్

