MP Jairam Ramesh: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీ పేరును MNREGA నుండి తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, అంబేద్కర్, నెహ్రూ పేర్లు, వారి భావజాలం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండటమే బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలమని ఆరోపించారు. గాంధీ, నెహ్రూలను ప్రార్థించే వారిపట్ల మీకుండే చికాకు, ద్వేషం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయని విమర్శించారు. ఏడాది క్రితం కేంద్రం హోమంత్రి అమిత్ షా.. బీ.ఆర్. అంబేద్కర్ పై తన ధిక్కార స్వరాన్ని ప్రదర్శించారని జైరామ్ రమేష్ గుర్తుచేశారు.
గతేడాది కూడా ఇంతే..
సరిగ్గా ఏడాది క్రితం హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంటు వేదికగా అంబేద్కర్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా జైరామ్ రమేష్ గుర్తుచేశారు. ‘అంబేద్కర్ పేరును ఉపయోగించడం ఒక ఫ్యాషన్‌గా మారింది. మీరు దేవుని పేరును ఇంత ఎక్కువగా ప్రార్థించి ఉంటే, మీరు ఏడు జన్మల పాటు స్వర్గానికి చేరుకునేవారు’ అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది జరిగిన ఏడాది తర్వాత మహాత్మాగాంధీ పేరును MNREGA నుండి తొలగించడం ద్వారా తమ ఎజెండాను బీజేపీ మరింత ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
నెహ్రూను అపఖ్యాతి చేసేలా..
ఇటీవల పార్లమెంటులో వందేమాతరంపై చర్చ సందర్భంగా నెహ్రూపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర ఆరోపణలు చేసిందని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. భారత తొలి ప్రధానమంత్రిని అపఖ్యాతి పాలు చేసే విధంగా నడుచుకున్నారని మండిపడ్డారు. గాంధీ, అంబేద్కర్, నెహ్రూల ఉమ్మడి వారసత్వంపై ఆధారపడిన భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంప్రదాయాన్ని బీజేపీ-ఆర్ఎస్ఎస్ నెమ్మదిగా క్షీణింపజేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
Also Read: Sarpanches: కొత్త సర్పంచ్‌లకు అలెర్ట్.. బాధ్యత స్వీకరణ తేదీ వాయిదా.. ఎందుకంటే?
‘అది బీజేపీ వల్ల కాదు’
గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ను అపఖ్యాతి పాలు చేయడం బీజేపీ అధినాయకత్వం వల్లకాదని జైరామ్ రమేష్ స్పష్టం చేశారు. ఆ ముగ్గురి కీర్తిని చెరిపేసేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాదన్నారు. గాంధీ, నెహ్రు, అంబేద్కర్ లతో ముడిపడిన భారత దేశ ఆత్మను ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. మహాత్ముల పేర్లను తొలగించడం ద్వారా కొత్త భారత దేశాన్ని నిర్మించలేరని పేర్కొన్నారు. ఈ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం.. ఈ దేశ వారసత్వంపై ఆధారపడి ఉండటమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు.

