Ponguleti Srinivasa Reddy: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరును తొలగించడం ఆయనను అవమానించినట్లేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఆయన పేరును తొలగించడం సిగ్గుచేటని అన్నారు. ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపీఎ ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఉపాధి హామీ పధకాన్నితీసుకువస్తే, గడచిన పది సంవత్సరాల నుంచి బిజేపీ ప్రభుత్వం ఆ పధకానికి తూట్లుపొడుస్తూ నీరుగారుస్తోందని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి, రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని నెట్టడం పేదల పొట్ట కొట్టడమేనని దుయ్యబట్టారు.
రాష్ట్రాలపై మోయలేని భారం
పార్లమెంట్‌లో తీసుకువచ్చిన బిల్లు అభివృద్ది తిరోగమనమేనని, రాష్ట్రాలపై మోయలేని భారమని అన్నారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ఇప్పుడు ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్’ గా మార్చడం అన్యాయమని అన్నారు. లోక్‌సభలో బలవంతంగా ఆమోదించిన ఈ కొత్త బిల్లు, పథకం యొక్క స్వభావాన్ని, నిధుల సమీకరణను పూర్తిగా మార్చివేసిందని విమర్శించారు.
ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద 20 ఏళ్ల క్రితం యూపీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం కనిపిస్తోందని, పేరు మార్చినంత మాత్రాన వారి వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోలేరని అన్నారు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ, గ్రామీణ భారతానికి వెన్నెముకగా ఉన్న పథకాన్ని అగాధంలోకి నెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, పేదల కడుపు కొడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇరుకు స్థలాల సమస్యకు పరిష్కారం.. పట్టణ పేదలకు పొంగులేటి తీపికబురు

