Ponguleti Srinivasa Reddy: పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) దృష్టి సారించారు. సచివాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతి కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. కనీసం 30 చదరపు మీటర్ల (సుమారు 322 చదరపు అడుగులు) విస్తీర్ణంలో జీ ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా జీవో 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ‘మాది గేదెలాంటి ప్రభుత్వం’.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు
నిర్మాణ మార్గదర్శకాలు
స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని, అరకొర వసతులతో, తాత్కాలిక షెడ్లలో జీవిస్తున్న వారికి ఆర్సీసీ స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు జీ+1 విధానంలో రెండు వేర్వేరు గదులు (96 చదరపు అడుగులు, 70 అడుగులు), అలాగే కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి. ప్రతీ ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్‌రూం తప్పనిసరిగా ఆర్సీసీ స్లాబ్‌తో నిర్మించాలి. నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌లకు డీఈఈ (హౌసింగ్) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తారు. మొదటి అంతస్తు రూఫ్ లెవల్ వరకు నిర్మాణమైతే రూ.1 లక్ష, గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ వేసిన తర్వాత రూ.1 లక్ష, ఆపై ఫస్ట్ ఫ్లోర్‌లో నిర్మాణాలు పూర్తయ్యాక రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలిన రూ.1 లక్ష విడుదల చేస్తామని పొంగులేటి తెలిపారు.
Als Read: Min Ponguleti Srinivasa Reddy: ధరణితో భూ హక్కులు విధ్వంసమే.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!
