Ramchander Rao: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై త్వరలోనే అధ్యయన కమిటీ వేస్తామని, అంతేకాకుండా విజిట్ కూడా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అన్ని జిల్లాల్లో త్వరలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సైతం ఇస్తామని వెల్లడించారు. బీజేపీకి ఓటు శాతం పెరుగుతూ ఉండటంతో భయపడి కేసీఆర్ బయటికి వచ్చారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలకు కేసీఆర్ నిజాలు చెబితే బాగుండేదని, గంటన్నర స్పీచ్ లో కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పడం తప్పా పస లేదని మండిపడ్డారు. తెలంగాణకు ఇప్పటి వరకు రూ.3 లక్షల 70 వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు ఇచ్చినట్లు చెప్పారు. కేసీఆర్ మాత్రం ప్రజలకు ఫసల్ భీమా అందకుండా చేశారని మండిపడ్డారు.
ఇకపోతే ప్రభుత్వం ఫెయిల్
ప్రాజెక్టుల రిపేర్లకు కృషి సంచాయ్ యోజన కింద తెలంగాణకు రూ.వెయ్యి కోట్లు కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లో మరోసారి వాటర్ సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ట్రంప్ కార్డులా వాడుకుంటూ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్నారు. ఈ విషయం తనకు బీఆర్ఎస్ నాయకుడే చెప్పారన్నారు. ఇకపోతే ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ తెరలేపుతోందని రాంచందర్ రావు చురకలంటించారు. ఈ రెండు పార్టీలు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసమే ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతుంది తప్పితే రైతుల సంక్షేమం పట్టదని మండిపడ్డారు.
Also Read: Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే
ప్రజలకు మేలు చేయాలి
పులి బయటికి వచ్చిందని బీఆర్ఎస్ ప్రగల్భాలు పలుకుతోందని, పులి, పిల్లులు బయటకి రావడం కాదని, ప్రజలకు మేలు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా తొలుత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. దేశానికి అందించిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. ఆపై భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నారాయణగూడలో నిర్వహించిన అటల్ జీ స్మృతి సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యాఉ. త్రినేత్ర ఫౌండేషన్ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని వారికి అభినందనలు తెలిపారు.

