Ramchander Rao: బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపితే ఊరుకునేది లేదని, తాటా తీస్తామని కాంగ్రెస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)హెచ్చరించారు. నాంపల్లి పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపే సంస్కృతి సరైనది కాదని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందని, గతంలో ఎన్టీ రామారావు పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టలేదా అని ఆయన ప్రశ్నించారు. అది తప్పు కాదా అని నిలదీశారు. గాంధీ కోరిన రామరాజ్యం, గ్రామ స్వరాజ్యానికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
పదేళ్లలో రూ.8 లక్షల కోట్లు ఖర్చు
మహాత్మ గాంధీ ఉపాధిహామీ పథకానికి పేరు మార్చడం తప్పుకాదని ఆయన పేర్కొన్నారు. గాంధీ పేరు పెట్టుకున్న ఫేక్ గాంధీలు ఉన్నారని, వారికి గాంధీపై అభిమానం ఉంటే వారి పేర్ల నుంచి గాంధీ తొలగించుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే మహాత్మ గాంధీ పేరు పెట్టుకున్నారంటూ ఆయన ఫైరయ్యారు. నరేగా కింద పదేళ్లలో రూ.8 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. నరేగా స్కీమ్ లో రామ్ ఉన్నందుకే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. నరేగా పథకాన్ని 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచినట్లు రాంచందర్ రావు వివరించారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ నిర్దోషులని ఏ కోర్ట్ చెప్పిందని, వారు బెయిల్ పై ఉన్నారని రాంచందర్ రావు తెలిపారు.
Also Read: Ramchander Rao: ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? : రాంచందర్ రావు
ఆ నాయకుడికే కాంగ్రెస్ గౌరవమివ్వలేదు
ఇదలా ఉండగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయంపై రాంచందర్ రావు ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని మాట్లాడుతుందో అలాంటి రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్ ను కూడా కాంగ్రెస్ ఇన్ ఫ్లుయెన్స్ చేసి రాజ్యాంగబద్ధ నిర్ణయాన్ని తీసుకోకుండా చేసిందని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారో ఆ నాయకుడికే కాంగ్రెస్ గౌరవమివ్వలేదని చురకలంటించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతున్న నేతకూ గౌరవం ఇవ్వలేదన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై జరిగిన హత్యగా రాంచందర్ రావు పరిగణించారు.

