Ramchander Rao: కేంద్రం ఇప్పటి వరకు ఏ సిటీకి నిధులు ఆపలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు. తెలంగాణ సమాజమే కాంగ్రెస్ సర్కార్‌ను భూస్థాపితం చేస్తుందని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రధాన కార్యదర్శులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
8 జిల్లాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ
ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. బీజేపీ (BJP) అంటే భయం పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా అబద్ధపు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నదని మండిపడ్డారు. ఈ నెల 7న మహా ధర్నాకు 8 జిల్లాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మహా ధర్నా తరువాత దీనిపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో చేసిందేమీ లేదని, అవినీతి పెరిగిపోయిందని, గత బీఆర్ఎస్ సర్కార్ లాగానే ఫెయిల్యూర్ పాలన అయ్యిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొత్తం ఫ్లాప్ అయ్యిందని, హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్‌మెంట్ ఇలా అన్నింటిలో విఫలమైందని విమర్శించారు.
Also Read:Ramchander Rao: యాంటీ ఇండియా ఐడియాలజీ ఉన్నవారికి అవార్డులా? ఇది అత్యంత దుర్మార్గం!
ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా?
సిటీ ప్లానింగ్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, కేవలం కేంద్రం మీద ఏడవడమే కాంగ్రెస్ పాలసీనా అంటూ రాంచందర్ రావు మండిపడ్డారు. అమృత్ స్కీం, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ ఇలా అనేక పథకాలకు కేంద్రం ఏనాడూ నిధులు ఆపలేదని తెలిపారు. ఇక, సంచారీ సాథీపై తప్పుడు ప్రచారం తగదని అన్నారు. భారత ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ విషయంలో, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతుంటాయని, తీసుకొచ్చే ఏ పథకం, ఏ యాప్ అయినా ప్రజా సంక్షేమం, భద్రత కోసం మాత్రమే ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం రూపొందించిన ‘సంచార్ సాథీ’ యాప్, డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రజా సంక్షేమం, భద్రత కోసం తీసుకొచ్చారని, భద్రత బలోపేతం చేయడానికి, సైబర్ సెక్యూరిటీ కోసం ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత మండలానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ పాలన వైఫల్యాలు మోసాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ : రాంచందర్ రావు
