Womens World Cup Final: భారతదేశంలో మహిళా క్రికెట్ చరిత్రను మార్చివేయవచ్చని అంచనా వేస్తున్న ఉమెన్స్ వరల్డ్ కప్-2025 ఫైనల్ (Womens World Cup Final) మ్యాచ్‌లో టాస్ పడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియం వేదికగా భారత ఉమెన్సె వర్సెస్ దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య జరుగుతున్న ఈ ఫైనల్‌లో సఫారీ జట్టు టాస్ గెలించింది. ఆ జట్టు కెప్టెన్ లారా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తుది జట్లు ఇవే..
ఇండియా ఉమెన్స్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
దక్షిణాఫ్రికా ఉమెన్స్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బోష్, సునే లూస్, మరిజాన్ కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయోన్, నడిన్ డి క్లెర్క్, అయబొంగా ఖాకా, నోంకులేకో మ్లాబా.
టాస్ గెలిస్తే బౌలింగ్ చేసేవాళ్లం
టాస్ సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులను దృష్ట్యా టాస్ గెలిచి ఉంటే తాము కూడా మొదట బౌలింగ్ చేసేవాళ్లమని చెప్పింది. ఫైనల్ మ్యాచ్ చాలా ముఖ్యమైనదని, టీమిండియా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు అనిస్తోందని పేర్కొంది. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి, బోర్డుపై ఒక భారీ స్కోరు ఉంచుతామని ఆశిస్తున్నట్టు పేర్కొంది. వర్షం, వాతావరణం కారణంగా ఈ పిచ్ కొంచెం స్లోగా ఉందని, అవుట్‌ఫీల్డ్ కూడా కొద్దిగా తేమగా అనిపిస్తోందని చెప్పింది. కానీ ఐదారు ఓవర్ల తర్వాత మారిపోతుందని అనుకుంటున్నట్టు హర్మాన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘‘మేము మళ్లీ భయం లేకుండా ఆడతాం. పాజిటివ్‌గా ఉంటాం. మా ప్రణాళికల ప్రకారం ఆడతాం. ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం. సెమీస్‌లో గెలుపును ఆస్వాదించాం. ఆ విజయ ఆస్వాదం నుంచి కోలుకోవడానికి, రీసెట్ చేయడానికి రెండు రోజులు తీసుకున్నాం. ఇప్పుడు అందరూ తిరిగి మ్యాచ్‌పై దృష్టి సారించారు’’ అని వివరించింది.
టాస్ ఆలస్యం
ఆదివారం (నవంబర్ 2) సాయంత్రం 3 గంటలకే మొదలవ్వాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. వర్షం కాస్త తగ్గడంతో సాయంత్రం 4.32 గంటలకు టాస్ షెడ్యూల్ చేస్తూ అంపైర్లు ప్రకటించారు. మళ్లీ వర్షం రాకపోవడంతో టాస్ వేశారు. సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ 5 గంటలకు మొదలైతే ఓవర్ల కుదింపు ఉండబోదని అంపైర్లు క్లారిటీ ఇచ్చారు.
