IND vs SA 5th T20I: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య నేడు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడీయంలో కీలకమైన ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ మనదే అవుతుంది. అలా కాకుండా దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే 2-2 తేడాతో సిరీస్ సమం అవుతుంది. ఇదిలా ఉంటే లక్నో వేదికగా జరగాల్సిన నాల్గో టీ20 పొగమంచు కారణంగా రద్దయ్యింది. దీంతో నేటి మ్యాచ్ కు కూడా ఫాగ్ ఆటంకం కలిగిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నేడు బరిలోకి దిగబోయే భారత జట్టులో కీలక మార్పులు ఉండబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
వారిద్దరు ఔట్.. వీరిద్దరు ఇన్
ఐదో టీ20 మ్యాచ్ కు వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలి వేలుకు గాయం కావడంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో గిల్ వరుసగా విఫలమవుతూ రావడం, సంజూని తిరిగి జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్స్ అంతకంతకు పెరిగిపోతుండటంతో అతడి రాక ఖాయంగా కనిపిస్తోంది. అయితే తనకు అలవాటైన ఓపెనింగ్ స్థానంలో సంజూ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ధర్మశాల మ్యాచ్ (మూడో టీ20)కు దూరమైన బుమ్రా తిరిగి తన హౌమ్ గ్రౌండ్ లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అతడు జట్టులోకి వస్తే హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ లలో ఒకరు బెంచ్ కు పరిమితం కావాల్సి ఉంటుంది.
మంచు ప్రభావం ఉంటుందా?
మంచు ప్రభావంతో నాల్గో టీ20 రద్దు కావడంతో నేటి మ్యాచ్ పైనా దాని ప్రభావం ఉంటుందా? అన్న ఆందోళనలు ఒక్కసారిగా ఫ్యాన్స్ ను చుట్టుముట్టాయి. అయితే అహ్మదాబాద్ లో మ్యాచ్ సమయంలో 20°C ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. లక్నోతో పోలిస్తే గాలి నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుందని సమాచారం. విజన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీంతో ఐదో టీ20 ఎలాంటి ఆటంకం లేకుండా సవ్యంగా సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో డ్యూ ఫ్యాక్టర్ కీలకంగా మారుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా టాస్ గెలిచిన జట్టుకు విజయవకాశాలు మెరుగవుతాయని పేర్కొంటున్నారు.
Also Read: Bangladesh Protests: బంగ్లాలో తీవ్ర స్థాయిలో భారత వ్యతిరేక నిరసనలు.. హిందూ యువకుడిపై మూక దాడి.. డెడ్‌బాడీకి నిప్పు
పిట్ రిపోర్ట్..
నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ విషయానికి వస్తే ఇది బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు. ఇక్కడి ఫ్లాట్ పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభ ఓవర్లలో పేసర్లకు సహకారం లభించవచ్చు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మ్యాచ్ 7.00 గం.లకు ప్రారంభం కానుండగా.. అరగంట ముందు అంటే సా. 6.30 గం.లకు టాస్ వేయనున్నారు. హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో మ్యాచ్ ను లైవ్ లో వీక్షించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెళ్లలో లైవ్ ప్రసారం అందుబాటులో ఉంటుంది.
భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, శివం ధూబె, హర్షిత్ రానా/వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

