Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు.. దిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులు, నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులతో వరుసగా భేటి అవుతున్నారు. ఇవాళ ఒక్కరోజే మెుత్తం ఆరుగురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు జల్ శక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్, జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.
పెండింగ్ నీటి ప్రాజెక్టులపై చర్చ..
దిల్లీ పర్యటనలో భాగంగా తొలుత కేంద్ర జల్ శక్తి మంత్రి సీ.ఆర్ పాటిల్ లో సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు.పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించి పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని గుర్తు చేశారు.
ఆర్థిక మంత్రితో భేటి..
ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్య, నైపుణ్యాకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని కోరారు. రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. సీఎం ప్రతిపాదనల పట్ల ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ లో భేటీ అయ్యారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని… pic.twitter.com/sklJOZnIRI
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 19, 2025
Also Read: V.C. Sajjanar: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. ఆర్బీఐని కూడా వదలట్లే.. సజ్జనార్ బిగ్ అలర్ట్!
‘ఫిషింగ్ హార్బర్లకు నిధులు ఇవ్వండి’
అనంతరం కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రి కార్యాలయానికి వెళ్లి కలిశారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ భేటిల్లో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు సీఎం తోడుగా పాల్గొన్నారు.
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర… pic.twitter.com/HjdOZsVaJX
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 19, 2025

