Uttam Kumar Reddy Warning: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు పునఃప్రారంభించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఎస్ఎల్బీసీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టే ఇన్నాళ్లు ఓపిక పట్టామన్న ఆయన.. ఇకపైనా ఆలస్యమైతే ఊరుకునేది లేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. సంబంధిత శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇతర ఇంజనీర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొరంగం ప్రవేశం, వెలుపలికి వచ్చే మార్గాల్లో బోర్ యంత్రానికి బదులు అధునాతన సాంకేతికతను వాడాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. నిధుల చెల్లింపునకు ఎస్క్రో ఖాతా తెరవాలని గతంలోనే సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఖాతా తెరవడానికి అవసరమైన సంతకాల విషయంలో నిర్మాణ సంస్థ తమ ప్రతినిధుల పేర్లు సక్రమంగా ఇవ్వడం లేదని ఇంజనీర్లు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు అడ్వాన్స్ గా బిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Also Read: V.C. Sajjanar: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. ఆర్బీఐని కూడా వదలట్లే.. సజ్జనార్ బిగ్ అలర్ట్!
దీంతో మంత్రి ఉత్తమ్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనట్లు తెలుస్తోంది. ‘చెల్లింపుల విషయంలో భయం ఉన్నోళ్లు వెళ్లిపోండి.. అవసరమైతే నేను పూచి సంతకం చేస్తా’ అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమ మంచితనాన్ని బలహీనతగా భావించవద్దని.. ఇన్నాళ్లు నిర్మాణ సంస్థ ఏమన్నా భరించామని మంత్రి ఉత్తమ్ అన్నట్లు టాక్. ఇకపై కఠినంగా వ్యహరిస్తామని.. ఒప్పందం ప్రకారమే చెల్లింపులు జరుగుతాయని తేల్చి చెప్పినట్లు సమాచారం. వారంలో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పనులు ప్రారంభించాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

