V.C. Sajjanar: సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు తమ రూటు మార్చుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, ఫ్రాడ్ కాల్స్, బ్లాక్ మెయిల్ రూపంలో మోసాలకు తెగబడుతూ వచ్చిన సైబర్ నేరస్తులు.. ఇప్పుడు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని టార్గెట్ చేశారు. ఆర్బీఐ ఏజెంట్లమని చెప్పుకుంటూ అమాయకుల నుంచి భారీ మెుత్తంలో దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆర్బీఐ తీసుకొచ్చిన ఉద్గమ్ (UDGAM) పోర్టల్ పేరు చెప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారో అవగాహన కల్పించారు.
‘జనం నెత్తిన టోపీ’
సైబర్ నేరగాళ్లు తమ రూటు మార్చారంటూ సజ్జనార్ తన తాజా ట్వీట్ లో ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఆర్బీఐ ‘ఉద్గమ్’ పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల!’ అంటూ తన పోస్ట్ కు ఆకర్షణనీయమైన టైటిల్ సైతం పెట్టారు. ‘సైబర్ నేరగాళ్లు రూట్ మార్చిన్రు. ఈసారి ఆర్బీఐని కూడా వదలట్లే. బ్యాంకుల్లో మురిగిపోయిన పైసలు (Unclaimed Deposits) ఇప్పిస్తామంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నరు. ఆర్బీఐ తీసుకొచ్చిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్ పేరు చెప్పి నయా దందా మొదలుపెట్టిన్రు’ అంటూ సామాన్యుల భాషలో సజ్జనార్ ఎక్స్ లో రాసుకొచ్చారు.
‘ఇలా మోసం చేస్తున్నారు’
‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా సిటీ కమిషనర్ సజ్జనార్ తెలియజేశారు. ‘మీ పాత ఖాతాల్లో లక్షలున్నయ్.. ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి’ అని మెసేజ్ లు, మెయిల్స్ పంపిస్తున్నరు. ఆశపడి ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్ అయితది. క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయితది’ అంటూ ప్రజలను హెచ్చరించారు.
Also Read: Pakistan Condoms GST: ‘ప్లీజ్.. కండోమ్ ధరలు తగ్గించండి’.. ఐఎంఎఫ్‌కు పాకిస్థాన్ రిక్వెస్ట్!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సీపీ సజ్జనార్ తన తాజా పోస్టులో కొన్ని జాగ్రత్తలు సైతం ప్రజలకు సూచించారు. ‘ఆర్బీఐ ఎప్పుడూ మీ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదు. ఆఫీసర్లు అని ఫోన్ చేస్తే నమ్మకండి. అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కోసం https://udgam.rbi.org.in అనే వెబ్‌సైట్ మాత్రమే చూడాలి. వాట్సాప్, మెయిల్స్ లో వచ్చే పిచ్చి లింకులను అస్సలు క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయండి. లేదంటే http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. ఆలస్యం చేస్తే పైసలు గోవిందా’ అంటూ హెచ్చరించారు. అంతేకాదు మోసం జరుగుతున్న తీరును సైతం తెలియజేస్తూ ఓ వీడియోను సైతం సజ్జనార్ పోస్ట్ చేశారు.
ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల!
సైబర్ నేరగాళ్లు రూట్ మార్చిన్రు. ఈసారి ఆర్బీఐని కూడా వదలట్లే. బ్యాంకుల్లో మురిగిపోయిన పైసలు (Unclaimed Deposits) ఇప్పిస్తామంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నరు. ఆర్బీఐ తీసుకొచ్చిన 'ఉద్గమ్' (UDGAM) పోర్టల్ పేరు చెప్పి… pic.twitter.com/b8WN5GR7IX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2025

