Handshake controversy: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆటకు సంబంధించిన విశేషాల కన్నా, రాజకీయ వాతావరణం ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేయకపోవడం హాట్ టాపిక్‌గా (Handshake controversy) మారింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలికి (ICC) ఫిర్యాదు కూడా చేసినట్టుగా సమాచారం.
మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వవద్దంటూ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించారని పీసీబీ ఆరోపించింది. మ్యాచ్ రిఫరీ అయ్యుండి ఇలా చెప్పడంపై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై నేరుగా పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘మ్యాచ్ రిఫరీ క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించారంటూ మేము ఐసీసీకి ఫిర్యాదు చేశాం. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను వెంటనే ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’’ అని మొహ్సిన్ నక్వీ పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొహ్సిన్ నక్వీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్‌గా ఉన్నారు.
Read Also- Jharkhand Encounter: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం.. మరో ఇద్దరు కీలక నేతలు సైతం?
పాక్ ఆటగాళ్లకు క్షమాపణ చెప్పిన మ్యాచ్ రిఫరీ!
మ్యాచ్ ముగిసిన తర్వాత హేక్‌హ్యాండ్ లేదనే విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం పాకిస్థాన్ ఆటగాళ్లకు చెప్పడం మ్యాచ్ రిఫరీ మర్చిపోయినట్టుగా ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ వర్గాలు చెప్పాయి. తన పొరపాటు పట్ల పాక్ టీమ్‌కు మ్యాచ్ రిఫరీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ స్వయంగా క్షమాపణ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా, టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆదివారం పొద్దుపోయాక ఉర్దూలో పాక్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రిపరీ ఆండీ పైక్రాఫ్ట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించింది. పాక్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా ఈ వ్యవహారంపై, మ్యాచ్ రిఫరీ ప్రవర్తనపై ఐసీసీ వద్ద అధికారికంగా నిరసన తెలిపారని పేర్కొంది. అయితే, ఈ వ్యవహారంపై ఐసీసీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ మరో ట్వీట్ ద్వారా స్పందిస్తూ, క్రీడా స్ఫూర్తి దెబ్బతినడం చూసి తీవ్ర నిరాశ చెందానని అన్నారు. రాజకీయాలను ఆటలోకి తీసుకురావడం, క్రీడా విలువలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనైనా అన్ని జట్లూ విజయాలు గౌరవప్రదంగా జరుపుకుంటాయని ఆశిస్తున్నానని మొహ్సిన్ నక్వీ వ్యాఖ్యానించారు.