Womens World Cup: భారత మహిళా క్రికెటర్లు అంచనాలను తలకిందులు చేస్తూ ఆదివారం రాత్రి (నవంబర్ 2) చరిత్రలో తొలిసారి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్-2025ను (Womens World Cup) ముద్దాడారు. మహిళల్ని కూడా పురుషులతో సమానంగా చూస్తే ఫలితం ఎలా ఉంటుందో మన అమ్మాయిలు చేసి చూపించారు. ఒకప్పుడు మెన్స్ క్రికెటర్లు వాడిపడేసిన జెర్సీలను ఉమెన్ క్రికెటర్లకు ఇచ్చేవారు. వాటిని సైజులు చేయించుకొని, వాళ్ల పేర్లు రాయించుకొని మన అమ్మాయిలు మైదానాల్లోకి దిగారు. అంతేనా, ప్రాక్టీస్ కోసం సెకండ్ గ్రేడ్ మైదానాలను కేటాయించేవారు. అంటే సరైన వసతులు లేని గ్రౌండ్‌లలో ప్రాక్టీస్ చేసేవారు. ఇక, శాలరీలు అంటారా?, ఏదో మొక్కుబడిగా ఉండేవి. కాంట్రాక్టుల వ్యవస్థ సరిగా ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు వేతనాలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టులను కూడా పొందుతున్నారు. ఉమెన్స్ క్రికెటర్లకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలైతే కొన్ని రెట్ల మేర మెరుగుపడ్డాయి. వీటన్నింటి వెనుక బీసీసీఐ కృషి చాలానే ఉంది.
ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కావు
ఇటీవలి కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ కీలకమైన చర్యలు తీసుకుంది. మౌలిక వసతుల కల్పన, కాంట్రాక్ట్ వ్యవస్థ బలోపేతం, సమాన వేతన విధానం (Equal Pay Policy) అమలు ప్రధాన చర్యలుగా చెప్పవచ్చు. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను భారత్ గెలవడం వెనుక ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు కనీసం ఉమెన్స్ ప్లేయర్లకు తగిన ట్రైనింగ్ సౌకర్యాలు కూడా ఉండేవి కావని గుర్తుచేస్తున్నారు. ఇలా అయితే ఆట మెరుగుపడదని గుర్తించిన బీసీసీఐ… మహిళా క్రికెట్‌ను పురుషుల క్రికెట్ స్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కొత్త అకాడమీలు, అనుబంధ సెంటర్లను ఏర్పాటు చేసిందని ప్రస్తావిస్తున్నారు. ఉమెన్ ప్లేయర్లకు ఫిట్‌నెస్ ట్రైనర్లు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు, డేటా అనలిస్టులు వంటి సహాయక బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటన్నింటి చర్యల ఫలితంగా మహిళా క్రికెటర్ల ప్రొఫెషనలిజం చాలా మెరుగుపడింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడేటప్పుడు మన అమ్మాయిలు ఇప్పుడు గొప్ప ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్నారు.
బీసీసీఐ 2022 చివరి నుంచి ‘ఈక్వల్ పే పాలసీ’ని అనుసరిస్తోంది. అంటే, పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు చెల్లిస్తోంది. ఇదొక చారిత్రాత్మకమైన మలుపు అని క్రీడా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మెన్స్ క్రికెటర్ల స్థాయిలో మ్యాచ్ ఫీజులు అందుకుంటున్నారని చెబుతున్నారు. ఒక్క టెస్టుకు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు పొందుతున్నారని ప్రస్తావిస్తున్నారు. ఈ సమానత్వం ఆటగాళ్లలో ఉన్నతస్థాయి ప్రతిభను బయటకు తెచ్చి, తమ ఆటకు విలువ ఉందన్న భావనలో వారిలో కలించేలా చేసిందని, ప్రొఫెషనల్ అథ్లెట్లుగా తమ కెరీర్లను ప్లాన్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, ఐపీఎల్ మాదిరిగా మహిళా క్రికెటర్లకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించి, అనుభవజ్ఞులైన ఇంటర్నేషనల్ ప్లేయర్లతో ఆడే అవకాశం కల్పించడం కూడా ఆటపై మరింత అవగాహన పెరిగేలా దోహదపడింది. ఉమెన్స్ క్రికెటర్ల మానసికంగా రాటుదేలేలా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్లతో తరచు సిరీస్‌లు ఆడేలా బీసీసీఐ ప్రణాళికాబద్ధం నడుచుకుంటోంది. మొత్తం మీద, ఈ మార్పులన్నీ మహిళా క్రికెట్‌తో పాటు దేశంలో క్రీడారంగంలో అమ్మాయిల భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహపడుతున్నాయి.
ఈ విజయం క్రికెట్‌కే పరిమితం కాదు
చారిత్రాత్మక విజయం ఒక్క క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదని చెప్పవచ్చు. దేశ క్రీడా రంగంలోనే గొప్ప మైలురాయిగా, మహిళా క్రీడల్లో నూతన యుగంగా అభివర్ణించవచ్చు. కరణం మల్లేశ్వరి, పీటీ ఉష, పీవీ సింధూ వంటి అథ్లెట్లు తమ వ్యక్తిగత క్రీడా ప్రతిభతో యావత్ దేశంలోని బాలికలు, అమ్మాయిల్లో ఏవిధంగానైతే స్ఫూర్తి నింపారో అదే స్థాయిలో ఈ వరల్డ్ కప్ విజయం కూడా ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1983లో భారత పురుషుల జట్టు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశంలో క్రికెట్ ఒక మతంగా ఎలా మారిపోయిందో.. మహిళా క్రికెట్‌లో తాజా విజయం అంతగొప్ప ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. క్రీడలు అంటే మగపిల్లలకే అనే భావన నుంచి బయటపడే పిల్లలు, తల్లిదండ్రులు ఈసారి పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అమ్మాయిలకు క్రీడలంటే కేవలం హాబీలు మాత్రమే కాదు.. కెరీర్లు అని నమ్మేవారు కచ్చితంగా కొన్నిరెట్ల మేర పెరుగుతారు. వరల్డ్ కప్ విజయం పుణ్యమా అని మహిళా క్రీడలపై ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగి, కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తుందని ఆశించవచ్చు.
