Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి (Telanagana Jagruthi) అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) చేపట్టిన ‘జనం బాట’ (Janam Bata) కార్యక్రమం.. అదిలాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని మార్కెట్ యార్డ్ (Adilabad market yard)ను సందర్శించిన కవిత.. పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పత్తి రైతుల బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అన్నారు. వర్షాలు పడుతుండటంతో పత్తి రైతు నష్టపోతున్నట్లు కవిత అన్నారు. పత్తికి తేమను పీల్చుకునే గుణం ఉన్నందున.. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
రైతులంటే లెక్కలేదా?
రాష్ట్రంలోని అన్ని చోట్ల పత్తి రైతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘మార్కెట్ కు పత్తి తీసుకొస్తే 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తామని చెబుతోంది. అసలు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి, ఎంపీ, ఎమ్మెల్యేలకు మొంథా తుపాను వచ్చిన విషయం తెలియదా? ఆదిలాబాద్ లో ఎంపీ, ఎమ్మెల్యే కూడా బీజేపీ వారే ఉన్నారు. వారికి పత్తి రైతును ఆదుకునే బాధ్యత లేదా? పత్తి తేమ శాతం ఎక్కువ ఉన్న సరే కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో మేము కలెక్టర్ గారితో మాట్లాడితే సీసీఐ తో మాట్లాడాలని చెబుతారు. 12 నుంచి 20 శాతం తేమ ఉన్న సరే కొనుగోలు చేయండి అంటే రాష్ట్రం ప్రభుత్వంతో మాట్లాడమంటారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు రైతులంటే లెక్కలేదా?’ అని కవిత నిలదీశారు
‘సీఎం.. సమీక్ష చేయాలి’
వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ వాళ్లే రైతులకు మేలు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు. ‘ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో రైతులను చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. కడుపు తరుక్కు పోతుంది. రూ.50వేల నష్టానికి ఒక్కో బండిని రైతులు అమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టాలి. అక్కడ ఏ పార్టీ గెలిచిన ఒరిగేదీ ఏమీ లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై సీఎం వెంటనే సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నా. 20 నుంచి 25 శాతం తేమ ఉన్నా సరే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తరఫున చెప్పండి. ఒక్క పత్తి రైతు మాత్రమే కాదు మక్కా, సోయ, వరి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తేమ, బూజు, మొలకలు వచ్చిన సరే కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే రూల్ కావాలి’ అని కవిత అన్నారు.
Also Read: Bus Accidents In Telangana: తెలంగాణలో జరిగిన భయంకర బస్సు ప్రమాదాలు.. ఇవి ఎప్పటికీ పీడకలే!
కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు?
తెలంగాణ రాష్ట్రాన్ని మీకు పదవులు ఇవ్వడానికి తెచ్చుకోలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి కవిత అన్నారు. ‘ఇక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ పక్ష నేత కూడా. ఆయన ప్రధానికి, కేంద్రమంత్రితో మాట్లాడి పత్తి రైతులకు మేలు చేయాలి. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్లు మాట్లాడితే కేంద్రం ఒప్పుకోదా?. రైతుల కోసం బీజేపీ నేతలు పనిచేయాలి. ఒకసారి రైతుల వద్దకు వస్తే గానీ మీకు వాళ్ల బాధ అర్థం కాదు. మార్కెట్ యార్డ్ లో హామీలుగా ఉన్న 70 మంది ఆడబిడ్డలను తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఏడీ గారితో మాట్లాడితే ప్రస్తుతానికి దాన్ని ఆపారు. వారి పొట్ట కొట్టవద్దని కలెక్టర్ గారిని కోరుతున్నా. వారిని పనిలో కొనసాగించాలి’ అని కవిత కోరారు.
