Bahujan Samaj Party: తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీకి నూతన రథసారధి వచ్చారు. పార్టీ జనరల్ సెక్రెటరీతో పాటు బడంగ్‌పేట మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్‌గా పని చేసిన ఇబ్రాం శేఖర్ (Ibrahim Shekhar)ను అధ్యక్షుడిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నియమించారు. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ ప్రకటనను అధికారికంగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్ష పదవికి మంద ప్రభాకర్ రాజీనామా చేశారు. దీంతో నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యం అయింది. దీంతో అధ్యక్ష పదవికి నామినేషన్లు తీసుకున్నారు. సుమారు ఎనిమిది మంది అధ్యక్ష పదవికి పోటీ పడగా.. ఎప్పటి నుంచో అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్న ఇబ్రాం శేఖర్(Ibrahim Shekhar)కే అవకాశం దక్కింది.
Also Read: Advait Kumar Singh: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై కేసు నమోదు..?
2013లో బీఎస్పీలోకి ఎంట్రీ
గతంలో ఎంఆర్‌పీఎస్‌లో పని చేసిన ఇబ్రాం శేఖర్(Ibrahim Shekhar) 2013లో బీఎస్పీ ఫౌండర్ కాన్షీరాం గురించి తెలుసుకున్న అనంతరం.. బీఎస్పీ(BSP)లో చేరితేనే బహుజన కులాలకు న్యాయం అందడంతో పాటు రాజ్యాధికారం దక్కుతుందని రియలైజ్ అయ్యానని గతంలో ఆయన అన్నారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. రెండు సార్లు జనరల్ సెక్రెటరీగా, ఒకసారి స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. బీఎస్పీ(BSP) నుంచి పలు మార్లు ఎన్నికల్లో గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది.
డిప్యూటీ మేయర్‌గా గెలవడం శేఖర్ రాజకీయ చతురత
2006లో హైదరాబాద్ పరిధిలో ఉన్న బాలాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్‌గా గెలిచిన ఇబ్రాం శేఖర్(Ibrahim Shekhar)అనంతరం ఆ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపాలిటీలో విలీనం అయ్యాక 2013లో బాలాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. ఇక 2020లో బడంగ్‌పేట్ మున్సిపాలిటీగా అవతరించడంతో మరోసారి కార్పొరేటర్‌గా గెలిచి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. బీఎస్పీ నుంచి ఒక్కడే గెలిచినప్పటికీ.. తన రాజకీయ చాకచక్యంతో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుని ఐదేళ్లు కొనసాగారు.
బహుజనులకు రాజ్యాధికారమే నా సంకల్పంః ఇబ్రాం శేఖర్
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలంటే రాజకీయంగా పురోగతి సాధించాలని, బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే ఆర్థిక, రాజకీయ, సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందని నూతన అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అన్నారు. ఆధిపత్య అగ్రవర్ణాలు, రాజకీయపార్టీలకు ఓట్లు వేసినంత కాలం బహుజనుల బతుకులు బాగుపడవని, భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా కలిగిన ఏకైక పార్టీ బీఎస్పీనని, ఓటు ఒక పోరాట సాధనమని, దాన్ని అమ్ముకోవడం తమను తాము అమ్ముకోవడమేనని, బహుజనులు ఓటును పదునైన ఆయుధంగా వాడి అధికారంలోకి రావాలన్నది బీఎస్పీ సిద్ధాంతమని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బెహన్ మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని ఆయన అన్నారు.
సామాజిక న్యాయం అందరికీ అందాలంటే అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి. బహుజన సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేస్తున్న బెహన్ మాయావతి ప్రధాని అయితే, బలహీన, పీడిత వర్గాలకు రాజ్యాధికారం లభిస్తుంది. నా శక్తి, సామర్థ్యాలపై నమ్మకంతో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతి, బీఎస్పీ ముఖ్య జాతీయ కన్వీనర్ ఆకాష్ ఆనంద్, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాజారం నాకు అత్యంత కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను” అని అన్నారు. పార్టీలోని సీనియర్లు, మేధావులు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని, వారందరి సూచనలతో బీఎస్పీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి బలోపేతానికి కృషి చేస్తానని గౌతం ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Viral Video: ప్రభుదేవా సాంగ్‌ను.. చించి ఆరేసిన ఓల్డేజ్ కపుల్.. వీడియో వైరల్