KTR: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమయ్యాయి
KTR (imagecredit:twitter)
Political News, Telangana News

KTR: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమయ్యాయి: కేటీఆర్

KTR: పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నరని చెప్పుకుంటున్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బహిరంగ సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఏవైపుఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కెటిఅర్(KTR) అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరిని కేటీఆర్ తనదైన శైలిలో కడిగిపారేశారు.

ఆ 66 శాతం నిజమైతే.. తేల్చుకుందాం రా!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని కేటీఆర్ విమర్శించారు. “నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ, సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి గారూ.. మీకు నిజంగానే 66 శాతం ప్రజాధరణ ఉంటే, నా సవాల్ స్వీకరించండి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలే చెప్తారు ఎవరి శాతం ఎంతో.. ఎవరి బతుకెంతో.. ఎవరి సత్తా ఎంతో ప్రజా క్షేత్రంలోనే తేలిపోతుంది” అని కేటీఆర్ గర్జించారు.

గడ్డిపోచ లాంటి పదవుల కోసం ఇంత దిగజారుతారా?

ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంత్రులుగా, స్పీకర్‌లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కేవలం ‘గడ్డిపోచ’ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. “బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట కాంగ్రెస్‌లో చేరామని చెప్పి, స్పీకర్ ముంగట పోయి తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. అటలో అంపైర్ గా ఉండాల్సిన స్పీకర్ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లారని, ఇక ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు పూర్తిగా ఆగమైపోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Also Read: Panchayat Elections: గతంలో కంటే రికార్డ్ స్థాయి పోలింగ్.. పంచాయతీ ఎన్నికల్లో 85.30 శాతం ఓటింగ్

మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారు

రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారని స్పష్టం చేశారు. “సిరిసిల్లలో 117 పంచాయతీలకు గాను 80 చోట్ల బీఆర్ఎస్ గెలవడమే దీనికి నిదర్శనం. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. పల్లెలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తలకు భరోసా..

బెదిరింపులకు, ఫోన్ కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. “గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలి. వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటాం. పాత తరం అనుభవం, కొత్త రక్తం కలిసేలా చాకుల్లాంటి పిల్లలతో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాం” అని ప్రకటించారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: Revenge Crime: రెండు కుటుంబాల మధ్య పగ.. ఇటీవలే ఒక హత్య.. పోస్టుమార్టం నిర్వహించగా…

Just In

01

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!

Illegal Land Registration: ఫోర్జరీ పత్రాలతో శ్రీ సాయిరాం నగర్ లేఅవుట్‌​కు హెచ్​ఎండీఏ అనుమతి.. కోర్టు ఆదేశాలు లెక్కచేయని ఓ అధికారి..?