Revenge Crime: ఏళ్ల తరబడి కొనసాగే పగ, ప్రతీకారాలు సినిమా కథల్లో (Revenge Crime) కనిపిస్తుంటాయి. ముఖ్యంగా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో ఈ తరహా మూవీస్ పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. రెండు కుటుంబాల మధ్య వైరం.. దెబ్బకు దెబ్బ తీయడం.. హత్యకు హత్యతో బ్యాలెన్స్ చేస్తూ కథలు సాగుతుంటాయి. అచ్చం ఈ తరహాలోనే ఢిల్లీలో ఓ రెండు కుటుంబాల మధ్య చాలాకాలంగా ప్రతీకారం కొనసాగుతోంది. అందులో భాగంగానే, నవంబర్ 30న ఢిల్లీలోని ఆయా నగర్‌లో దారుణ హత్య (Delhi Murder Case) జరిగింది. రత్తన్ రోహియా అనే 52 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ రోజు ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు బయలుదేరిన ఆయనపై, అప్పటికే కారులో కాపుకాచుకొని కూర్చున్న ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. దీందో, రత్తన్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మృతదేశానికి పోస్టుమార్టం నిర్వహించగా, షాకింగ్ విషయం బయటపడింది. అతడి శరీరంలో ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 69 బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. కాల్పుల ధాటికి శరీరం తూట్లు తూట్లు పడింది.
Read Also- Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అధికారిక ప్రకటన.. అనుమానాలకు చోటు లేదని క్లారిటీ ఇచ్చిన పోలీసులు
చంపించింది ఎవరు?
రంభీర్ లోహియా, అతడి బంధువులే ఈ హత్య చేయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా పగ, ప్రతీకారాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదే రంభీర్ లోహియా కొడుకు అరుణ్ హత్యకు గురయ్యాడు. మే 15న అరుణ్ కారులో తన ఇంటికి వెళుతున్న సమయంలో మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు దండుగులు కాల్పులు జరిపారు. దీంతో,అరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు. అరుణ్ హత్య కేసులో రత్తన్ పెద్ద కొడుకు అరెస్టయ్యాడు. కాగా, కొడుకు మరణానికి ప్రతీకారంగా రంభీరే ఈ హత్య చేయించి ఉంటాడని రత్తన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రత్తన్‌ను చంపేస్తామంటూ రంభీర్, అతడి కుటుంబ సభ్యులు చాలా కాలంగా హెచ్చరిస్తూ వచ్చారని రత్తన్ కూతురు చెప్పింది. తన తండ్రికి ఎవరితోనూ వ్యక్తిగత పగ, ప్రతీకారాలు లేవని ఆమె చెప్పారు. ఈ వైరం పెద్దల మధ్య మొదలవ్వలేదని, వారి కొడుకుల కారణంగా వచ్చిందని రత్తన్ సోదరి చెప్పారు.
కాగా, రత్తన్ హత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా, కాల్పులు జరిపిన దుండగులు ఓ కారులో వచ్చినట్టు గుర్తించారు. అయితే, ఆ కారు నంబర్ కనబడకుండా ముందుగానే నంబర్ ప్లేట్‌ను తొలగించారని పోలీసులు చెప్పారు. కాగా, రత్తన్ హత్య జరిగిన రోజు, ఘటనా స్థలంలో ఖాళీ షెల్స్, లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రత్తన్ హత్య ఉదయం సుమారు 6 గంటల సమయంలో జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిందని తెలిపారు. ఆయా నగర్‌లోని సండే మార్కెట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగిందని, నల్ల రంగు నిస్సాన్ మాగ్నైట్ కారులో ముగ్గురు దుండగులు ఎదురుచూస్తున్నట్లు సీసీ ఫుటేజీలలో కనిపించిందని చెప్పారు. విదేశీ గ్యాంగ్‌లకు సుపారీ ఇచ్చి, ఈ మర్డర్ చేయించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.

