Zubeen Garg: ప్రసిద్ధ గాయకుడు జుబిన్ గార్గ్ సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు సింగపూర్ పోలీస్ ఫోర్స్ (SPF) వెల్లడించింది. ఈ ఘటన సెప్టెంబర్ 19న చోటుచేసుకుంది.
సింగపూర్‌లో అమలులో ఉన్న కోరోనర్స్ యాక్ట్–2010 ప్రకారం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు గురువారం తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో జుబిన్ గార్గ్ మృతిలో ఫౌల్ ప్లే ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని SPF స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక అన్ని వివరాలను సింగపూర్ రాష్ట్ర కోరోనర్‌కు సమర్పిస్తామని, ఆయన ఆధ్వర్యంలో కోరోనర్ ఇన్క్వైరీ (CI) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విచారణ 2026 జనవరి, ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.
Also Read: Government Job: ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయని చదువు పోరాటం.. తల్లిదండ్రుల కలను నిజం చేసిన కుమారుడు!
కోరోనర్ ఎన్క్వైరీ అనేది మృతికి గల కారణాలు, పరిస్థితులను స్పష్టంగా నిర్ధారించే ఒక వాస్తవాల పరిశీలన ప్రక్రియ అని పోలీసులు వివరించారు. ఈ విచారణ పూర్తయ్యాక ఫలితాలను ప్రజలకు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసులో సంపూర్ణమైన, వృత్తిపరమైన దర్యాప్తు చేపడుతున్నామని సింగపూర్ పోలీసులు స్పష్టం చేశారు.
అలాగే, ఈ విషయంలో ప్రజలు ఓపికతో ఉండాలని, నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గత వారం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో గాయకుడి కార్యదర్శి సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంతా సహా నలుగురిపై హత్య ఆరోపణలు నమోదు చేశారు.
జుబిన్ గార్గ్, సెప్టెంబర్ 20న సింగపూర్‌లోని సన్‌టెక్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగాల్సిన 4వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా, అంతకుముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కేసులో భారత్, సింగపూర్ రెండుచోట్ల వేర్వేరు కోణాల్లో విచారణలు కొనసాగుతుండటంతో, అసలు నిజం ఏంటన్నది రాబోయే కోరోనర్ ఇన్క్వైరీ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

